Israel | న్యూఢిల్లీ, జూన్ 27: దక్షిణ లెబనాన్‌లోని హిజ్బొల్లా భూగర్భ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ మహిళ మరణించగా, 20 మంది గాయపడ్డారు. పర్వతాలకు సమీపంలో ఉన్న దక్షిణ లెబనాన్‌లోని నబతియేహ్ నగరంపై శుక్రవారం బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసినట్లు లెబనాన్ వార్తా సంస్థ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని జ్రారియెహ్, అన్సర్ గ్రామాల మధ్య ఉన్న ప్రాంతంపై కూడా ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల కారణంగా భారీ పేలుళ్లు జరిగిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. హిజ్బొల్లాకు చెందిన రక్షణ నిల్వలపై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గతంలో తాము దాడి చేసిన భూగర్భ స్థావరంలో భాగమే ఇవి కూడానని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ తమ దేశంలోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపిందని లెబనాన్ ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. కాగా గురువారం దక్షిణ లెబనాన్‌లోని జెబీల్ జిల్లాలోని బీట్ లీఫ్ పట్టణంపై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో మోటారు సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తి మరణించాడు. మేస్ అల్-లబల్ పట్టణంలో ఓ ట్రక్కుపై కూడా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిగింది. ఇద్దరు హిజ్బొల్లా సభ్యులను అంతం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం గురువారం ప్రకటించింది.
ఖమేనీని చంపాలనుకున్నది నిజమే
టెల్ అవీవ్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగి యుద్ధం ముగిసిన వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కీలక విషయాన్ని వెల్లడించారు. యుద్ధం సమయంలో తాము ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీని అంతం చేయడానికి ప్రణాళిక రచించిన మాట నిజమేనని, అయితే ఆ సమయంలో ఆయన రహస్య ప్రదేశంలో దాక్కోవడంతో దానిని విరమించుకున్నామని కట్జ్ తెలిపారు. అటువంటి చర్య వల్ల అంతర్జాతీయంగా కలిగే పరిణామాల ప్రమాదం గురించి ప్రశ్నించగా, దానికి తమకు అమెరికా అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ వార్తా సంస్థలతో ఆయన మాట్లాడుతూ తాము ఖమేనీ జాడ కోసం తీవ్రంగా ప్రయత్నించామని, కానీ నిర్దేశిత సమయంలోగా ఆయన ఎక్కడున్నదీ కనిపెట్టలేక పోయామన్నారు. ఆయన చాలా లోతైన రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారని, తన కమాండర్లతో కూడా మాట్లాడలేదని, కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా బంద్ చేశారని చెప్పారు. ఆయనే కనుక తమ దృష్టిలో పడితే హతమార్చి ఉండేవారమని అన్నారు. ఇరాన్లో అధికార మార్పిడి తమ లక్ష్యం కాదని, అయితే అక్కడి నాయకత్వాన్ని అస్థిరపర్చాలనుకున్నామని ఆయన తెలిపారు.