లండన్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్ఠాత్మక విజ్డన్ అవార్డు రేసులో నిలిచారు. 2022 సంవత్సరానికి విజ్డన్ ప్రకటించిన ‘క్రికెటర్స్ ఆఫ్ ది ఈయర్’ జాబితాలో హిట్‌మ్యాన్ రోహిత్, బుమ్రాతో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ డేవాన్ కాన్వే, ఇంగ్లండ్ పేసర్ ఓలి రాబిన్సన్, దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ డేన్ వాన్ నీకర్క్ స్థానం దక్కించుకున్నారు. నిరుడు వేసవిలో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ 52.57 సగటుతో 368 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ‘లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్’ అవార్డుకు పురుషుల్లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్, మహిళల్లో లిజెల్లీ లీ ఎంపికయ్యారు. ‘టీ20 క్రికెటర్ ఆఫ్ ది వరల్డ్’గా పాకిస్థాన్ వికెట్ కీపర్, బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ నిలిచాడు.