మనందరికీ తేనెటీగలు తెలుసు. కానీ వాటిని చేపల కేటగిరీలో ఎవరైనా చేరుస్తారా? ఎవరైనా ఆ మాట అంటే.. అవి కీటకాలురా అని తిట్టిపోస్తారు. అయితే సాక్షాత్తూ ఒక కోర్టు.. ఈ మాట చెప్పింది. తేనెటీగల జాతికే చెందిన బంబుల్ బీ కీటకాలను చేపల కేటగిరీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో వెలుగు చూసిన ఘటన.
బంబుల్ బీలలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయని, వాటిని కూడా కాలిఫోర్నియా ఎండేజర్డ్ స్పెసీస్ చట్టం (సీఈఎస్ఏ-సెసా) పరిధిలోకి తీసుకురావలని కొన్ని వ్యవసాయ సంఘాలు కోర్టుకెక్కాయి. అయితే సెసా చట్టంలో కేవలం పక్షులు, క్షీరదాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, మొక్కలు మాత్రమే వస్తాయి. కీటకాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు.
ఇదే విషయాన్ని ఎత్తి చూపిన సదరు వ్యవసాయ సంఘాలు.. క్రాచ్, ఫ్రాంక్లిన్, సక్లీ కుక్కూ, వెస్టర్న్ బంబుల్ బీ జాతులను కూడా సెసా చట్టంలో చేర్చాలని డిమాండ్ చేశాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ కీటకాలను కూడా చేపల కేటగిరీలో చేర్చి సెసా రక్షణ కల్పించింది. ఈ రక్షణ చట్టం ప్రకారం ఏవి అంతరించిపోతున్న జీవులు? అనే విషయాన్ని నిర్ణయించే అధికారం తమకు ఉంటుందని కోర్టు తెలిపింది.