శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10: గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గురువారం గచ్చిబౌలి హాస్పిటల్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సోమాలియా దేశానికి చెందిన 26 ఏండ్ల గులెమ్ మహ్మద్ హెర్సీ అక్కడ జరిగిన కాల్పుల్లో గాయపడగా, ఇటీవల కేర్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజు నేతృత్వంలోని వైద్యబృందం 12గంటలపాటు శస్త్రచికిత్స చేసి మెదడులోని బుల్లెట్‌ను తొలగించారు. ఈ శస్త్రచికిత్స భారతదేశంలోనే అరుదైనదని, శస్త్రచికిత్స అనంతరం పేషెంట్ నెమ్మదిగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఈ సమావేశంలో కేర్ హాస్పిటల్ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజు, కేర్ హాస్పిటల్ సీవోవో నిలేశ్ తదితరులు పాల్గొన్నారు.