Budget 2026 : ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ లోక్‌సభ (Lok Sabha) లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రభావంతో కొన్ని రకాల వస్తువులు, ఔషధాల ధరలు తగ్గి అందుబాటులోకి రానున్నాయి. విదేశీ టూరిజం కూడా కొంతవరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరికొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. మరి వేటి ధరలు తగ్గనున్నాయో.. వేటి ధరలు పెరగనున్నాయో ఇప్పుడు చూద్దాం..
విదేశీ పర్యాటక ప్యాకేజీలపై ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ (TCS) ను 2 శాతానికి తగ్గించారు. విదేశీ విద్యపై టీడీఎస్‌ను లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద విద్యాఖర్చుల కోసం తగ్గించారు. ఆల్కహాలిక్ లిక్కర్ తుక్కు, కొన్ని రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని 5 శాతం నుంచి 2 శాతానికి కుదించారు. షూ అప్పర్ ఎగుమతుల కోసం అవసరమైన మెటీరియల్ దిగుమతిని డ్యూటీ రహితంగా ప్రకటించారు. సోలార్ గ్లాస్‌లకు సంబంధించిన కీలక మెటీరియల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) ని తొలగించారు.
ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలపై కూడా బీసీడీని తొలగించారు. క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్‌పై బీసీడీని మినహాయించారు. వ్యక్తిగత వినియోగానికి వాడే పరికరాలపై బీసీడీని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. క్యాన్సర్ తదితర అరుదైన వ్యాధులు, డయాబెటిక్ చికిత్సకు వాడే 17 రకాల ఔషధాలపై బీసీడీని పూర్తిగా తొలగించారు. అదేవిధంగా మన దేశ తీరప్రాంతం నుంచి ప్రత్యేక ఆర్థికమండలి పరిధి వరకు ఉన్న సముద్ర జలాల్లో మన జాలర్లు పట్టుకొన్న చేపల ధరలు కూడా తగ్గనున్నాయి.
అదేవిధంగా అణు విద్యుత్తు ప్రాజెక్టులకు వాడే పరికరాలు, విద్యుత్తు వాహనాల్లో వాడే బ్యాటరీలు, భారత్‌లో తయారయ్యే స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, విమానాల విడిభాగాలు తదితర వస్తువులు ధరలు తగ్గే వస్తువుల జాబితాలో ఉన్నాయి.
ఆదాయం వివరాలు సరిగ్గాచూపని వారికి విధించే జరిమానా 100 శాతానికి పెరగనుంది. బహిర్గతం చేయని చరాస్థులపై జరిమానా విధిస్తారు. విలాసవంతమైన వాచ్‌లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాల, గుట్కా ధరలు పెరుగుతాయి. కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాల ధరలు కూడా పెరగనున్నాయి. అమోనియం పాస్ఫేట్, అమోనియం నైట్రో పాస్ఫేట్ వంటి వాటి ధరలు పెరుగుతాయి.
చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాల ధరలు కూడా పెరగనున్నాయి.