Ramayana | దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పౌరాణిక ఇతిహాసాన్ని ఆధునిక టెక్నాలజీతో ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించాలన్న లక్ష్యంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. టీజర్ విడుదలకు ముందే అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు హైప్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మేకర్స్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ టీజర్ సుమారు 2 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఉండబోతోందని టాక్. ఇందులో ప్రధాన పాత్రలైన రాముడు, సీతతో పాటు రావణుడు, హనుమంతుడు పాత్రలను పరిచయం చేయనున్నారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, రావణుడి పాత్రలో యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. అందుకే హిందీతో పాటు ఇంగ్లీష్‌లో కూడా టీజర్ విడుదల చేయనున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
సినిమాకు సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ మరియు హాన్స్ జిమ్మెర్ కలిసి అందిస్తున్నారు. ఈ అరుదైన కాంబినేషన్ సినిమా స్థాయిని మరింత పెంచనుందని భావిస్తున్నారు. ఈ మహత్తర ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రామాయణ టీజర్ విడుదలకు ముందే భారీ హైప్ సృష్టించడంతో, ఈ చిత్రం భారతీయ సినిమాను మరోసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందా అనే ఆసక్తి నెలకొంది. టీజర్ విడుదల తర్వాత ఈ అంచనాలు మరింత పెరగడం ఖాయం.