దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ నష్టాలతో ముగిశాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ)కుతోడు, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా గరిష్ఠ స్థాయిల్లో లాభాల స్వీకరణకు దిగడంతో నిఫ్టీ 338 పాయింట్లు నష్టపోయింది. గురువారం బేరిష్ ఫ్లాగ్ ప్యాట్రన్ కావడంతో మరింతగా పతనం కావడానికి సంకేతాలను అందించింది. ఈ ఒక్కరోజే ఎఫ్ఐఐలు రూ.3,930.62 కోట్ల అమ్మకాలు జరుపడంతో ఈ నెలలో ఇప్పటివరకు రూ.9,99 9.51 కోట్ల అమ్మకాలను చేసినైట్లెంది. బ్యాంకింగ్, ఫార్మాతోసహా కీలక రంగాల షేర్లన్నీ బలహీనంగా ఉన్నాయి.
నిఫ్టీ 50 రోజుల చలన సగటుకు దిగువన ముగియడంతోపాటు, దీర్ఘకాల చార్ట్‌లో ఎంఏసీడీ బేరిష్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వారం మార్కెట్ గమనంపై ఆ ప్రభావం పడనున్నది. మిగతా ట్రెండ్ ఇండికేటర్లేవీ ఆశాజనకంగా కనిపించడంలేదు. మూడు వారాల క్రితం నమోదైన 17,613-18,342 స్థాయిలు కీలక మద్దతు రెసిస్టెన్స్ స్థాయిలుగా పని చేయనున్నాయి.
50 రోజుల చలన సగటుకు దిగువనే మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటే నిఫ్టీ 17,326 స్థాయిని ఆ తర్వాత 17,216 స్థాయిలను తాకే అవకాశం ఉన్నది. ఇప్పటికే నిఫ్టీ 23.6 శాతం రీట్రేస్మెంట్ స్థాయిని దిగి ముగిసినందున, గత సోమవారం నాటి గరిష్ఠ స్థాయి 18,210ని దాటి ముగిసేంత వరకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకానున్నది. స్వల్పకాలిక మద్దతు స్థాయిలు 17,613, ఆ తర్వాత 17,452. ఈ స్థాయిల్లో నిఫ్టీ మద్దతు తీసుకుని బౌన్స్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఆ బౌన్స్ 18,210 స్థాయిని దాటి ముగిసేవరకు విశ్వసించలేం. ఈ వారమే నవంబర్ సీరిస్ డెరివేటివ్స్ ముగుస్తున్నందున ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉన్నది.