ఖమ్మం : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భట్టి ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ.. ఆ హామీలను ఇప్పటిదాకా ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో కూడిన గ్యారంటీ కార్డును రూపొందించిందని, అసరా పెన్షన్ల పెంపు, ప్రతి మహిళ రూ.2,500 నగదు, ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కింద నగదుతోపాటు తులం బంగారం, రైతు భరోసా తదితర గ్యారంటీలను పొందుపర్చారని కేటీఆర్ గుర్తుచేశారు.
ఆ గ్యారంటీ కార్డును జనాలకు చూపిస్తూ భట్టి విక్రమార్క.. ‘భద్రంగా పెట్టుకోండి’ అని చెప్పారని, 100 రోజుల్లో ఆ కార్డులోని గ్యారంటీలన్నీ అమలవుతాయని హామీ ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాదు, రెండేళ్లు కూడా పూర్తయిందని, ఇప్పుడు ఆ కార్డును ఎక్కడ పెట్టుకోవాలని ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో అడుగడుగునా అవినీతే జరుగుతున్నదని కేటీఆర్ విమర్శించారు. ఈ జిల్లా మంత్రి బాంబులేటి ప్రతి పనిలో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆయనతోపాటు తుమ్మల, భట్టి కూడా కమిషన్ల కోసం కక్కుర్తి పడటమే తప్ప ప్రజల మేలు కోసం చేసిన పని ఏమీ లేదన్నారు.