సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 18: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లెలో మళ్లీ బీఆర్ఎస్ (BRS) పార్టీ జెండా ఎగిరింది. స్వరాష్ట్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2015లో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 2013, 2019 పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సిలివేరి ప్రసూన, ఆత్మకూరి రంగయ్య యాదవ్ గెలుపొందారు. ఈ నెల 14న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆత్మకూరి జ్యోతి గెలుపొందడం విశేషం. వరుసగా ముగ్గురు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడంపై గ్రామంలో సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ చరిష్మా, కేటీఆర్‌పై అభిమానం చెక్కు చెదరకుండా ఉందనడానికి ఈ పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని చర్చించుకోవడం మరో విశేషం.
కాగా రామన్న పల్లె తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు అండగా నిలిచింది. 2006లో కరీంనగర్ ఎంపీ ఉప ఎన్నికల్లో రామన్న పల్లెకు కేసీఆర్ ప్రచారానికి వచ్చినప్పుడు మూకుమ్మడిగా మద్దతు పలికారు. ‘మా గ్రామం మొత్తం కేసీఆర్‌కే ఓట్లు వేస్తాం.. మా ఊరికి ఎవరూ రావద్దు’ అని ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గులాబీ పార్టీకి రామన్న పల్లె కంచు కోటగా ఉండటం గమనార్హం.