కొల్లాపూర్: గ్రామాలకు కొత్తగా సర్పంచులు (Sarpanch) వచ్చారు.. ఇక ఊర్లలో సమస్యలు పరిష్కారం అవుతాయి.. అనుకుంటున్న తరుణంలో, కొన్ని గ్రామాలలో గ్రామ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం, నూతన సర్పంచ్‌లు పదవి బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆయా గ్రామాల్లో పరిపాలన స్తంభించిపోయింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలం సింగోటంలోని (Singotam) గ్రామ పంచాయతీ కార్యాలయంలోని కార్యదర్శి (Panchayathi Secretary) గదికి గత కొద్దిరోజులుగా తాళం వేసి ఉంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో వివిధ సర్టిఫికెట్ల నిమిత్తం వస్తున్న ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచ్ ఫలితాలు వెలువడిన వెంటనే పంచాయతీ కార్యదర్శి గదికి తాళం పడినట్లు తెలుస్తున్నది. బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం కార్యదర్శికి ఫోన్ చేస్తే రిజిస్టర్లు పంచాయతీ కార్యాలయంలోని తన గదిలో ఉన్నాయంటున్నారని తెలిపారు. ఇదే విషయమై ఎంపీడీవో వెంకట్రావును నమస్తే తెలంగాణ వివరణ కోరగా గ్రామ నూతన సర్పంచ్‌తో మాట్లాడుతున్నామని, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల అనంతరం పంచాయతీ కార్యాలయంలోని గ్రామ కార్యదర్శి గదికి తాళం వేయించాడనే ఆరోపణల వెనుక ఉన్న మతలాబు ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు.
నో డ్యూస్పై చర్చ..
సర్పంచ్ ఎన్నికల ముందు వసూలు చేసిన నో డ్యూస్పై గ్రామంలో చర్చ నడుస్తుంది. నో డ్యూస్ వసూళ్లలో అక్రమాలు జరిగినట్లు గ్రామంలోని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పంచాయతీ కార్యదర్శి గదికి తాళం ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.