Santhana Prapthirasthu Movie | ప్రేమ, కెరీర్, రిలేషన్షిప్స్ మాత్రమే కాదు, ఈతరం చెప్పలేనంత సున్నితమైన సమస్యలతో కూడా సంఘర్షణ పడుతోంది. అందులో ఒకటి సంతాన లేమి. బయటికి మాట్లాడాలంటే సంకోచం, లోపల వేల సందేహాలు, వందల ఒత్తిడులు. అలాంటి సున్నితమైన విషయాన్ని కథగా మలచుకున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdary) జంటగా నటించిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడి ఇదే చిత్రం తాజాగా రెండు ఓటీటీల్లో విడుదల కానుంది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’, ‘జియో హాట్స్టార్’లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చైతన్య (విక్రాంత్) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఓ ఎగ్జామ్ సెంటర్ లో కల్యాణి (చాందిని చౌదరి) ను చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ దగ్గరౌతారు. కల్యాణి తండ్రి ఈశ్వరరావు (మురళీధర్ గౌడ్) వీరి ప్రేమని వ్యతిరేకించడంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుంటారు. త్వరగా బిడ్డని కనేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తాడు చైతు. కాకపోతే పిల్లల విషయంలో తన ప్రయత్నాలు ఫలించవు. దీంతో ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయిస్తాడు. వైద్య పరీక్షలు చేయించుకోగా చైతన్యకి ఓ సమస్య ఉన్నట్లు బయట పడుతుంది. తర్వాత ఏం జరిగింది? తన సమస్య కారణంగా చైతన్య ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు? చివరకు చైతన్య, కల్యాణికి పిల్లలు పుట్టారా లేదా ?అనేది మిగతా కథ.