Dhurandhar | ‘ధురంధర్’ వంటి సూపర్ హిట్ సినిమాతో సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా క్రేజ్ మరోసారి ఆకాశాన్ని తాకింది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా రెహ్మాన్ డకైట్ అనే పవర్ఫుల్ నెగటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విలన్ అయినప్పటికీ హీరోకంటే ఎక్కువ ప్రశంసలు దక్కడం ఆయన నటనకు నిదర్శనంగా మారింది. ప్రతి సీన్లో తనదైన స్టైల్, ఇంపాక్ట్‌తో మెరిసిన అక్షయ్ ఖన్నా ‘ధురంధర్’ సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. ఇదే ఏడాది ప్రారంభంలో విక్కీ కౌశల్ హీరోగా నటించిన ‘చావా’ సినిమాలో ఔరంగజేబు పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన, ఇప్పుడు ‘ధురంధర్’తో మరోసారి తన సత్తా చాటారు. కథ, పాత్ర ఏదైనా సరే.. తెరపై కనిపిస్తే తనదైన ముద్ర వేయడం అక్షయ్ ఖన్నాకే చెల్లింది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక సినిమాలతో పాటు అక్షయ్ ఖన్నా వ్యక్తిగత జీవితం కూడా తరచూ చర్చకు వస్తుంటుంది. ప్రస్తుతం ఆయన వయసు సుమారు 50 సంవత్సరాలు. అయినప్పటికీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీనిపై గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో అక్షయ్ ఖన్నా చాలా స్పష్టంగా మాట్లాడారు. “నాకు బాధ్యతలు వద్దు. నేను ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. ఎవరి గురించి ఆందోళన చెందకుండా నా జీవితాన్ని నేను ఆస్వాదించాలనుకుంటాను. నాకు ఇప్పుడు ఉన్న జీవితం చాలా బాగుంది. దాన్ని ఎందుకు మార్చుకోవాలి?” అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, “పెళ్లి అనేది ఒక పెద్ద నిబద్ధత. జీవితంలో భారీ మార్పు. మీరు మీ జీవితాన్ని వేరొకరితో పంచుకున్నప్పుడు పూర్తి నియంత్రణ మీ చేతిలో ఉండదు. కానీ నాకు నా జీవితంపై పూర్తి నియంత్రణ కావాలి. పెళ్లికి నేను సరైన వ్యక్తిని కాదు” అంటూ తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పారు. కుటుంబం లేదా సమాజం ఒత్తిడితో ఇష్టం లేకుండా వివాహం చేసుకోవడం సరికాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
అక్షయ్ ఖన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా కుమారుడు. 2025 నాటికి ఆయన మొత్తం ఆస్తులు సుమారు రూ.167 కోట్లుగా అంచనా వేయబడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో బంగ్లాలు, విలాసవంతమైన కార్లు ఆయన సొంతం. సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. నటుడిగా, వ్యక్తిగా తనదైన మార్గంలో ముందుకు సాగుతున్న అక్షయ్ ఖన్నా, పెళ్లి లేకుండానే సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ బాలీవుడ్లో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. ‘ధురంధర్’ విజయంతో ఆయనకు మరిన్ని ఆసక్తికర పాత్రలు రావడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.