Patolla Karthik Reddy | అధికార కాంగ్రెస్ పార్టీతో చిల్లిగవ్వ కూడా లాభం లేదని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారని అన్నారు. బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గులాబీ కండువా కాప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామరక్ష అని జనం బలంగా నమ్ముతున్నారని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయని అన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాజేంద్రనగర్‌కు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. రాజేంద్ర నగర్‌కు మెట్రో రాకుండా చేశారని మండిపడ్డారు. బండ్లగూడ ప్రాంతాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో వేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని పేర్కొన్నారు. సైబరాబాద్‌కు మకుటం లాంటి ప్రాంతం మనది అని వ్యాఖ్యానించారు. సైబరాబాద్ నుంచి హైదరాబాద్‌కు పోదామా అని ప్రశ్నించారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మన పోరాటానికి ప్రభుత్వం దిగి రావాల్సిందేనని స్పష్టం చేశారు.
కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిచేది గులాబీ పార్టీనే అని కార్తీక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్లలో మూడు మున్సిపాలిటీలు మనమే గెలుస్తామని.. కాంగ్రెస్ పార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగిపిస్తామని అన్నారు.