గట్టుప్పల్/చండూరు, జూలై 9 : తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని, పార్టీ అధికారంలో లేనంత మాత్రాన కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. చండూరు మండల కేంద్రంలో మంగళవారం మాజీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలను శాలువాలు, జ్ఞాపకాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటుందని, నిరుత్సాహానికి గురికావొద్దని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బీఆర్ఎస్ ఎంతో కృషి చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం 572 కోట్ల రూపాయలను తీసుకొచ్చి అభివృద్ధి పనులను చేపడితే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కమీషన్ల కోసం పనులు ఆపుతున్నారని విమర్శించారు.
పది రోజుల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టకపోతే ధర్నాలు, నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్వాయి స్రవంతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మాజీ ఎంపీపీ అవ్వారి గీతా శ్రీనివాస్, మారెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ గుర్రం మాధవీవెంకటరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, కొత్తపాటి సతీశ్, మాజీ ఎంపీటీసీలు గొరిగ సత్తయ్య, చెరుపల్లి భాసర్, కావలి మంగమ్మ ప్రసాద్, పెందుర్తి వెంకటమ్మ, మాజీ సర్పంచులు మెండు ద్రౌపత్తమ్మావెంకటరెడ్డి, ఇడెం రోజా, పంకెర్ల పద్మ, నాయకులు ఉజ్జిని అనిల్ రావు, మధుసూదన్ రావు, బొడ్డు సతీశ్, కూరపాటి సుదర్శన్ పాల్గొన్నారు.