హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి తన రెండేళ్ల పాలనలో చెక్ డ్యామ్‌ల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లను కూల్చివేస్తున్న ఉగ్రవాది రేవంత్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. 11 లక్షల 60 వేల 895 ఎకరాలకు నీళ్లిస్తామని అసెంబ్లీ చెప్పారని, కనీసం 11 వేల ఎకరాలకు అయినా నీళ్లు ఇచ్చిండ్రా..? అని ప్రశ్నించారు. తాము 17 లక్షల 24 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చామని, 31 లక్షల ఎకరాలను స్థిరీకరించామని చెప్పారు. రేవంత్‌రెడ్డి 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఎక్కడ ఇచ్చాడో చూపెట్టాలని, లేదంటే ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలని మండిపడ్డారు.
అసెంబ్లీ సాక్షిగా మోసం చేశామని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. కాంగ్రెస్ నేతలు ఇంక సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ‘నీ ప్రభుత్వం కేసీఆర్ కట్టిన చెక్ డ్యామ్‌లను తూటాలు పెట్టి పేల్చేసింది. వట్టెం పంప్‌హౌస్‌ను ముంచేసింది నీ ప్రభుత్వం. నీ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పకూలింది. శవాలను కూడా బయటికి తీయలేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్‌రెడ్డీ నీది. ఇంకా ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నవ్ సిగ్గులేకుండా. ఎస్ఎల్బీసీ కూలిపోతే శవాలను కూడా బయటికి తీయలేని చేతగాని ప్రభుత్వం నీది’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఎస్ఎల్బీసీ కూలినా, వట్టెం పంప్‌హౌస్ మునిగినా, చెక్‌డ్యామ్‌లను పేల్చినా ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయ చేతగాలేదని, ఒక్క చెరువు తవ్విన, ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదని, మీరు నీళ్ల గురించి మాట్లాడుతారా..? అని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెండేళ్లలో చెక్ డ్యాంల పేల్చివేత,
ప్రాజెక్టుల కూల్చివేత తప్ప కాంగ్రెస్ చేసింది ఏముంది?ప్రాజెక్టులు, చెక్ డ్యాంలను కూల్చి వేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి
ఎస్ఎల్బీసీలో శవాలను కూడా బయటకు తీయలేని
చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది రేవంతూ– మాజీ మంత్రి, ఎమ్మెల్యే… pic.twitter.com/6Iws6Tv8HV
— BRS Party (@BRSparty) December 22, 2025