హైదరాబాద్ : బీఆర్ఎస్ ( BRS ) పదేళ్ల తెలంగాణ పాలనలో జనసేన పార్టీపై గాని, తనపైగాని ఏనాడు ఆరోపణలు చేయలేదని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) తెలిపారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్( Congress ) వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని ఆరోపించారు. గత 13 నెలలుగా తనను పర్సనల్గా టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణకు రావొద్దని మంత్రుల స్థానంలో ఉన్న వ్యక్తులు బెదిరించడాన్ని జీర్ణించుకోలేకే మీ అయ్య జాగీరా అనే పదం వాడానని స్పష్టం చేశారు. తెలంగాణలో సభ పెట్టుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం, తెలంగాణలోకి రావొద్దనడం ప్రాథమిక హక్కుకు భంగమని అన్నారు.
తెలంగాణలోనే జనసేన పుట్టిందని, తెలంగాణలో లీడర్స్, కేడర్స్కు పార్టీకి ఉందని, సుమారు లక్షన్నర సభ్యత్వం ఉందని వెల్లడించారు. పార్టీ నాయకులు , కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నప్పుడు వాళ్ల కోసం పని చేయొద్దా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, తన వంతు సహకారం అందించాలనుకోవడంలో తప్పేముందని అన్నారు. తెలంగాణలో పోటీ చేయాలన్న ఆసక్తి తనకు లేదని తెలిపారు.