రామగిరి, జూన్ 10 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, రైతులు, కార్మికులు, ప్రజలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా అధిక సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేశారు.
ఈ ధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలతో అన్ని రంగాలపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో గ్యాస్ నిలువలు పుష్కలంగా ఉన్నాయని రేట్లు పెంచే ఆలోచన లేదని చెప్పి ఎన్నికలు అయిపోగానే ఒక నెలలోనే మూడుసార్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం విచారకరమని అన్నారు. మోదీ ప్రభుత్వం ఆలపిస్తున్న విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతూ ధనవంతులు మరింత ధనవంతులుగా పేదవాళ్లు మరింత పేదవారిగా మారుతున్నారని అన్నారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో జాప్యం చేస్తోందని విమర్శించారు. రైతు భరోసాను రెండు ఎకరాలకు పరిమితం చేయడం సరికాదని, సాగు చేస్తున్న ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందేలా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి అందరికీ సమానంగా చేరేలా చూడాలని, పక్షపాత ధోరణి అవలంబిస్తే గత ప్రభుత్వానికి ఎదురైన ప్రజా వ్యతిరేకతే ఈ ప్రభుత్వానికీ ఎదురవుతుందని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎల్-1, ఎల్-2 పేర్లతో జాప్యం జరుగుతోందన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేసి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ నుంచి మినహాయింపుకు గురైన రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బొల్గూరి నర్సింహా, బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం,ఆర్ అంజచారి,టి. వెంకటేశ్వర్లు, నల్పరాజు రామలింగయ్య తూము బుచ్చిరెడ్డి, పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ధర్నాలో ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు బి.జగన్, జిల్లా కార్యదర్శి చెల్లం పాండురంగారావు నేతృత్వంలోని కళాకారుల బృందం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఆలపించిన చైతన్య గీతాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.