కామారెడ్డి జిల్లా లింగంపేటలో దళితులపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. దళితుల బట్టలు విప్పి అరెస్టు చేసేంత ధైర్యం పోలీసులకు ఎవరిచ్చారు ? ఎవరి దన్ను చూసుకొని పోలీసులు విర్రవీగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమా.. అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగమా అని ప్రశ్నించారు. ? దళితులను అవమానించడమే ప్రజా పాలనా అని నిలదీశారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. బట్టలు విప్పి మరి దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనిన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన నలుగురు దళితుల జాడ ఎక్కడ? వారిని ఎక్కడ నిర్బంధించారని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా అని మండిపడ్డారు. లింగంపేటలో అరెస్టు చేసిన ముదాం సాయిలు, మోతే భూపతి, నెల్లూరి గంగాధర్, పరిమళ రాజు, మూస పూర్ వివేకానంద్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.