MLA Jagadish Reddy | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు నష్టం వాటిల్లే పనిని కేసీఆర్ ఎన్నడూ చేయరని విద్యుత్తుశాఖ మంత్రి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. సబ్ క్రిటికల్‌కు, సూపర్క్రిటికల్కు తేడా తెలియనివాళ్లు కూడా తమపై నిందలేస్తే ఎలా సహిస్తామని ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాల మధ్య, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాల్లో అవినీతికి ఆస్కారమే ఉండదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై కమిషన్ వేసిందని విమర్శించారు. ఆ కమిషన్‌కు కేసీఆర్ శనివారం రాసిన 12 పేజీల సుదీర్ఘ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో టీ న్యూస్ చానల్లో జగదీశ్‌రెడ్డి వివిధ అంశాలపై వాస్తవాలను వెల్లడించారు. విద్యుత్తు కొనుగోళ్లపై సమగ్ర విచారణ చేయాలని అసెంబ్లీ సాక్షిగా తామే డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీ 8వ చాఫ్టర్‌ను బయటపెట్టిన తెలంగాణ బిడ్డగా జస్టిస్ నర్సింహారెడ్డి అంటే తమకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నెల 11న విలేకరుల సమావేశంలో తమ ప్రభుత్వాన్ని నిందించే విధంగా జస్టిస్ నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఇరువర్గాల అభిప్రాయాలను వినకముందే పీపీఏల్లో అవకతవకలు జరిగాయని రాజకీయ పార్టీ నాయకుల్లాగా మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ కమిషన్ ఇలా వ్యవహరించలేదని మండిపడ్డారు. కమిషన్‌కు భయపడేవాళ్లమే అయితే తాము అసెంబ్లీలో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని ఎందుకు డిమాండ్ చేస్తామని ప్రశ్నించారు. కమిషన్ వ్యవహరించిన తీరే సరిగా లేదని మండిపడ్డారు.
నాడు విద్యుత్తు కొనుగోళ్లపై దురుద్దేశాలు ఆపాదించి..
ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్తు సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి ఈఆర్సీకి తన అభ్యంతరాలు తెలిపిన విషయాన్ని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. నాడు రేవంత్‌రెడ్డి లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకు న్నాకే తెలంగాణ విద్యుత్తు సంస్థల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. నాడు రేవంత్‌రెడ్డి ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలుంటే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు లేదా సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదన్నారు.