వికారాబాద్, డిసెంబర్ 12, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా తాండూరులోని ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ను గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు అరెస్ట్ చేశా రు. మాజీమంత్రులు సహా బీఆర్ఎస్ నేతలను వికారాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీసుల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించి, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వెళ్తామని జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఫోన్ చేసి మాట్లాడినా వెళ్లేందుకు అనుమతివ్వకపోవడంతో మాజీ మంత్రులతోపాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతు కు ఆనంద్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీ శ్రీశైల్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్తోపాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేశారు. అ నంతరం బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పో లీసులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీశైల్రెడ్డిలను చన్గోముల్ పోలీస్ స్టేషన్‌కు, మెతుకు ఆనంద్‌ను నవాబుపేట్ పోలీస్ స్టేషన్‌కు, శుభప్రద్పటేల్ను పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి అరెస్టులకు నిరసనగా తాండూర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి.
విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తుం టే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. హాస్టళ్లలోని బండారం బయటపడుతుందనే భయపడుతున్నారా? అని ఎద్దేవా చేశారు. తాండూరు, వికారాబాద్‌లలో దవాఖానలు న్నా విద్యార్థులకు హాస్టళ్లలోనే ఎందుకు చికిత్స అందిస్తున్నారని, కలెక్టర్, ప్రభుత్వం సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. అనుమతిస్తే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్తామని పేర్కొన్నారు. విద్యార్థుల పరామర్శకు ప్రొటోకాల్ వర్తించదని కలెక్టర్ చెప్తున్నారని, ఎమ్మెల్యే తమ్ముడికి ఉంటుంది కానీ, మాజీ మంత్రులకు ఉండదా? అని ప్రశ్నించా రు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను బీఆర్ఎస్కు అంటగట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రవీణ్‌కుమార్‌పై బురద జల్లుతున్నదని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్‌తో 48 మంది పిల్లలు చనిపోవడం బాధాకరమ ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. విద్యాశాఖ ఇప్పటికీ సీఎం వద్దనే ఉన్నదని, సమీక్ష జరిపి హాస్టళ్లలో పరిస్థితులను మెరుగుపర్చాలని కోరారు. గత పదేండ్లలో లేని పరిస్థితులు ఇప్పుడెందుకు తలెత్తుతున్నాయని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం పట్టింపు లేనట్టుగా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు.
ఫుడ్ పాయిజన్ ఘటనలు బీఆర్ఎస్ కుట్ర అని కాంగ్రెస్ ఆరోపిస్తున్నదని, కానీ కుట్ర సం స్కృతి కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాలను వెయ్యికి పెంచి విద్యార్థులను ప్రపంచం తో పోటీపడేలా కేసీఆర్ తయారుచేశారని, వి ద్యతోపాటు మంచి భోజనాన్ని కూడా అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గురుకులాలను నిర్వీర్యం చేసిందని, ఈ దుర్మర్గ ప్రభుత్వానికి పేద పిల్లలపై ప్రేమ లేదని అన్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన నాలు గు రోజులైనా విద్యార్థుల తల్లిదండ్రులను హాస్టల్లోకి అనుమతించడం లేదని కానీ, కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేషన్ చైర్మన్లను, వారితో వచ్చిన 30-40 మంది అనుమతించారని ఆరోపించారు. విద్యార్థులపై తల్లి ప్రేమతో వెళ్లే తమకు ప్రొటోకాల్ అవసరమా? అని ప్రశ్నించారు. గాలికి వచ్చిన కార్పొరేషన్ చైర్మన్లకు ప్రొటోకాల్ ఉంటుంది కానీ, ప్రజల ఓట్లతో గె లిచిన తమకు ఉండదా? అని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఎస్పీ అంటున్నారని, మహిళా ప్రజాప్రతినిధులు పోతే చూసుకునే సామర్థ్యం లేని మీరు రాష్ర్టాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు.
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తాండూరు గిరిజన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ బాధిత విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సహా పార్టీ సీనియర్ నేతలను అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిబిడ్డలకు కనీసం ఆహారం పెట్టలేని అమానవీయ ప్రభుత్వం అరెస్టుల పేరుతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తున్నదని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడమేనా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలను పరామర్శించే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న ప్రభుత్వ అమానవీయ వైఖరిని ఆయన ఖండించారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేస్తున్న ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం కాకుండా, పసిబిడ్డలకు పోషకాహారం అందించడం, సరైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అబద్ధాలు, అభూత కల్పనలతో, కాకిలెక్కలతో ప్రజలను మోసగించడమే ప్రభుత్వ విధానమా? అని ప్రశ్నించారు. రూ. 50 వేల కోట్లు, రూ. 65 వేల కోట్ల వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసమని నిలదీశారు.
ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టి ఇప్పటికీ ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారని, ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదని మండిపడ్డారు. అధికారం కోసం అబద్ధాలు, అధికారం దకిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు అని విమర్శించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నను ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
తాండూరు, డిసెంబర్ 12: తాండూ రు ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను గురువారం తాండూరు కోర్టు జడ్జ్జి శివలీల పరామర్శించారు. హైకోర్టు సూచనల మేరకు ఆమె గురుకుల పాఠశాలను సందర్శించి ఘటనపై ఆరా తీశారు. కలెక్టర్‌తో మాట్లాడి విద్యార్థినులకు చికిత్స అందిస్తున్న తీరు, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. అయితే, ఫుడ్ పాయిజన్ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ సెల్ పక్షాన అడ్వకేట్లు గోపాల్, నరేందర్‌గౌడ్ జిల్లా మొదటిశ్రేణి న్యాయమూర్తి శివలీలకు వినతిపత్రం అందజేశారు.
వికారాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తాండూర్ ఎస్టీ బాలికల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫుడ్ పాయిజన్ ఘటనపై హాస్టల్ వార్డెన్‌తోపాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేసింది. ఎస్టీ బాలికల హాస్టల్ వార్డెన్ విశ్వకుమారితోపాటు ముగ్గురు వంట సిబ్బందిని సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్‌తో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.