గరిడేపల్లి, జులై 05 : ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా సర్వారం పీఏసీఎస్ చైర్మన్ ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ గరిడేపల్లి మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణనాయక్ అన్నారు. ఎన్నిక తీరును నిరసిస్తూ శనివారం మండల కేంద్రంలోని కల్మల్చెరువు – గరిడేపల్లి ప్రధాన రహదారిపై పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం జరిగిన పార్టీ మండల అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వారం సొసైటీలో జరిగిన పీఏసీఎస్ చైర్మన్ ఎన్నికపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల మద్దతుతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వీరంరెడ్డి శంబిరెడ్డి సర్వారం పీఏసీఎస్ చైర్మన్‌గా రెండుసార్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొని విజయం సాధించినట్లు తెలిపారు. శంబిరెడ్డి విజయాన్ని జీర్ణించుకోలేని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ చర్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలు దురుద్దేశపూరిత ప్రణాళికలు రూపొందించి రాజీనామా చేసిన ఆ పార్టీ డైరెక్టర్లతో తీర్మానం చేయించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్‌ను చట్టవిరుద్దంగా తొలగించారన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకున్న పదవులను దుర్వినియోగం చేయడం చట్టానికి విరుద్దమన్నారు. దీన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యయుతంగా ధర్నా నిర్వహిస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
చట్టబద్దంగా ఎన్నికైన చైర్మన్‌ను అధికార బలంతో తొలగించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, మండల వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ కీత జ్యోతి రామారావు, సర్వారం పీఏసీఎస్ డైరెక్టర్లు గుగులోతు హేమ్లానాయక్, నెట్టెం రాజ్యం, నందిపాటి ముత్తమ్మ, కందుల గోవిందరెడ్డి, నాయకులు సైదయ్య, నాగరాజు, తెలబాటి నరేశ్, నరేందర్ పాల్గొన్నారు.
Garidepalli : సర్వారం పీఏసీఎస్ చైర్మన్ ఎన్నిక తీరుపై బీఆర్ఎస్ నాయకుల నిరసన