హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : సనత్‌నగర్ టిమ్స్‌ను సందర్శించి కాంగ్రెస్ సర్కార్ డొల్లతనాన్ని బట్టబయలుచేసేందుకు బయల్దేరిన బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం దమనకాండకు దిగింది. పోలీసులను అడ్డుపెట్టుకొని వెళ్లకుండా నిలువరించింది. బుధవారం ఉదయం కోకాపేటలోని తన నివాసం నుంచి బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు వాహనం బయటకు తీసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. హరీశ్‌రావు నివాసానికి చేరుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని పోలీసులు నిలువరించారు. లోనికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. అలాగే శ్రీనగర్‌కాలనీలోని నివాసంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, సికింద్రాబాద్‌లోని నివాసంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను గృహనిర్బంధం చేశారు. నార్సింగిలోని నివాసంలో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ను, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, క్రిశాంక్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను సైతం హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్ వద్ద పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. నాయకులు బయటకు రాకుండా నిలువరించారు.
టిమ్స్ దవాఖాన సందర్శనకు బయల్దేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ప్రజాధనంతో నిర్మించిన దవాఖానకు వెళ్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను నిలువరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఖాకీలను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతల గొంతునొక్కడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు అడ్డుకున్నా మరోసారి టిమ్స్‌కు వెళ్లి అక్కడి డొల్లతనాన్ని బహిర్గతం చేస్తామని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
టిమ్స్ సందర్శనకు వెళ్తున్న హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం సిగ్గుచేటని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీస వసతులు కల్పించకుండానే దవాఖానను ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యమందించే లక్ష్యంతో కేసీఆర్ ముందుచూపుతో నాలుగు టిమ్స్‌లకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై కక్షతో ఉద్దేశపూర్వకంగానే పూర్తిచేయడంలో నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి సనత్‌నగర్ టిమ్స్‌లో అన్నిరకాల వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నిర్బంధంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల గొంతు నొక్కలేరని పార్టీ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ నేతలు టిమ్స్‌కు వెళ్తానంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. నిత్యం ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న హరీశ్‌రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని, రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు.