చెన్నూర్, ఫిబ్రవరి 22: చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో రాష్ట్ర మంత్రి వివేక్‌వెంకటస్వామి రాజ్యాంగాన్ని ఖూనీ చేసి, నిరంకుశపాలన కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కోటపల్లి మాజీ వైస్ ఎంపీపీ వాల శ్రీనివాసరావు ఆరోపించారు. చెన్నూర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు బనాయించిన మంత్రి వివేక్‌కు ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా తన పదవీ కాలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చెన్నూర్ నియోజకవర్గానికి గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు.
అలాంటి తమ నాయకుడు బాల్క సుమన్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, సీపీఐ కూటమికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇలా మున్సిపాలిటీ చైర్మన్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడితే వారిపై ప్రజలే దాడులకు పాల్పడే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన కౌన్సిలర్ల కుటుంబ సభ్యులపైన రోజుకో విధంగా కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులతో పాటు సింగరేణి అధికారులు, అన్ని శాఖల అధికారులను ఈ అక్రమాల కోసం మంత్రి వివేక్ వాడుకుంటున్నారని ఆరోపించారు.
తమ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేసి గాయపర్చితే పోలీసులకు చెబితే కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో చెన్నూర్‌కు ఎమ్మెల్యేగా బాల్క సుమన్, రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో రాజ్యాంగబద్ధంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పక్రియ కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ మంత్రి బాపు మాట్లాడుతూ క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ రెండు ఓట్లు వేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అవసరమైన మెజార్టీ లేదని, అలాంటప్పుడు వీరిద్దరూ ఎందుకు ఓటింగ్ కోసం వెళ్లారని ప్రశ్నించారు.
ఎన్నిక రోజున లోపల అక్రమాలకు పాల్పడి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అక్రమంగా పొందేందుకు మంత్రి వివేక్, ఆయన కుమారుడు ఎంపీ వంశీ కుట్రతోనే వెళ్లారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి, కోటపల్లి సింగిల్‌విండో మాజీ చైర్మన్ సాంబగౌడ్, బీఆర్ఎస్ నాయకులు రేవెల్లి మహేశ్, జోడు శంకర్, సుధాకర్, ఆరీఫ్, ఆసంపల్లి సంపత్, రుద్రభట్ల సంతోష్, మానిశెట్టి శ్రీనివాస్, నయాబ్, తాటికొండ సురేశ్, తదితరులు పాల్గొన్నారు.