RS Praveen Kumar | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై పోక్సో కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని స్వయంగా మైనర్ బాలిక వచ్చి పోలీసుల ముందు చెప్పిందని తెలిపారు. బాధితురాలు న్యాయం కోసం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఇంతకీ ఆమె ఏం పాపం చేసింది, ఆమె కుటుంబం చేసిన పాపమేంటని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలి తల్లితో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడానని తెలిపారు. బిడ్డకు న్యాయం జరగాలని ఆ తల్లి పడ్డ వేదన బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో న్యాయం ఇంత ఘోరంగా ఉంటుందా అని వ్యాఖ్యానించారు. చట్టం ఉన్నవాళ్లకు చుట్టంలా ఉంటదా అని అనిపిస్తోందని మండిపడ్డారు. ఆ తల్లితో మాట్లాడుతుంటే.. ఆమె చెప్పిన విషయాలు బాధ కలిగించాయని వివరించారు.
‘ మే 8వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో ఆమె పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ కంప్లయింట్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి ఐదు గంటల సమయం పట్టింది. కంప్లయింట్లో ఉన్న కంటెంట్ మార్చాలని పోలీసులు ఒత్తిడి పెట్టారు. ఇందులో పెద్దపెద్ద వాళ్లు ఉన్నారని బెదిరించారు. పెద్దపెద్ద వాళ్ల పేర్లు రాయొద్దని సూచించారు. చివరకు ఆ తల్లి నా బిడ్డ, నేను మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని భయపెడితే తప్ప కంప్లయింట్‌కు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు. అప్పటికి కూడా ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ వారికి ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిందో రాలేదో బాధితులకు తెలియదు. నేను ఆ తల్లితో మాట్లాడిన తర్వాతే ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ తెలిశాయి.’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇది హోంమంత్రిగా ఉన్న రేవంత్ పాలనలో నాలుగు పాదాలపై నడుస్తున్న ధర్మమని మండిపడ్డారు.
‘ మోదీ గారూ.. మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి.. బేటీ బచావో అనే నినాదం మీ నోటి నుంచే వచ్చింది. కానీ ఈ దేశంలో మహిళలపై అడుగడుగునా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆడబిడ్డ పుట్టకముందే చంపేస్తున్నారు. మీ కేబినెట్ మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైంది. బండి సంజయ్ కొడుకు మైనర్ బాలికను బలత్కారం చేశాడు. ఆ కేంద్రమంత్రి ఇప్పుడు మీ పక్కనే కూర్చున్నాడు. మీ వేదిక ముందు వేలాది మంది తెలంగాణ మహిళలు కూర్చున్నారు. ఇప్పటివరకు మీరు బండి సంజయ్‌ను ఎందుకు బర్తరఫ్ చేయలేదు.’ అని ప్రశ్నించారు.