Jagadish Reddy | సూర్యాపేట: రాష్ట్రంలో నీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నా ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అవినీతి సొమ్మును లెక్కించే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయని జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అంటే అనుక్షణం భయంతోనే రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ను ఎక్కువగా గుర్తు చేసుకునే వారిలో రేవంత్ రెడ్డిదే ప్రథమ స్థానమని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారో లెక్కలు తీయడానికి సిద్ధమా? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు లేదని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. కళ్లముందే నీరు కనిపిస్తున్నా ఆ నీటిని ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తుంటే అడ్డుకోలేని పరిస్థితికి ప్రభుత్వ అసమర్థత, అవినీతే కారణమని ఆరోపించారు.
తనకు రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించిన మహబూబ్నగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. పాలమూరు ప్రాంతంలో మళ్లీ వలసలు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణమవుతున్నాయని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అన్యాయం జరుగుతున్నా జిల్లా మంత్రులు నోరు మెదపడం లేదని ఆయన మండిపడ్డారు. కళ్ల ముందే నీటి సమస్యలు కనిపిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలోని అనేక పట్టణాలు, పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్, తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టామని, ప్రస్తుత ప్రభుత్వం కరెంట్, నీరు అందించడంలో విఫలమైందని విమర్శించారు. “కేసీఆర్కు ఎదురుగా వచ్చే దమ్ము నీకుందా?” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వైఫల్యాలపై రేపటి నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట ప్రారంభమవుతుందని జగదీశ్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.
రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభంపై కేటీఆర్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో భారీ రైతు సభ నిర్వహించనున్నట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. ఈ సభకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా మిర్యాలగూడలో కేటీఆర్ రైతు సభను నిర్వహించి తీరుతామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.