Mamitha Baiju | తన సహజమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా మారుతోంది. ముఖ్యంగా ఆమె నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకోవడంతో మమితా పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. స్టార్ హీరోల సినిమాల్లో భాగమవుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.మమితా బైజు నటించిన మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక హీరోయిన్ కెరీర్లో ఇలాంటి అరుదైన కలెక్షన్ ట్రాక్ నమోదు కావడం విశేషంగా మారింది. దీంతో మమితాను పలువురు ట్రేడ్ వర్గాలు ‘గోల్డెన్ లెగ్’ అంటూ ప్రశంసిస్తున్నారు.
దళపతి విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్’లో మమితా బైజు కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో విజయ్‌కు కూతురిగా నటించి మెప్పించింది. సినిమా టాక్ విషయంలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ వసూళ్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు పేర్కొంటున్నారు. ఆ తర్వాత వర్సటైల్ స్టార్ సూర్య సరసన మమితా బైజు నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కుటుంబ బంధాలు, భావోద్వేగాలను ప్రధానంగా చూపించినట్లు తెలుస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే ఈ చిత్రం రూ.240 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటినట్లు సమాచారం.
ఈ రెండు సినిమాల విజయాల తర్వాత మమితా బైజు క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఇప్పుడు ఆమె నటించిన మరో మలయాళ చిత్రం కూడా అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ మలయాళ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. గిరీష్ ఏ.డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. నివిన్ పౌలీ కెరీర్లోనే కాకుండా మలయాళ సినిమా పరిశ్రమలో కూడా అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ఇదే జోరును కొనసాగిస్తే లాంగ్ రన్లో రూ.300 కోట్ల మార్క్‌ను కూడా అందుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైన వరుసగా మూడు సినిమాలు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన చిత్రాలుగా నిలవడంతో మమితా బైజు కెరీర్ ఇప్పుడు సరికొత్త స్థాయికి చేరుకుంది.