Eshwar Sai | హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్ డ్యాన్సర్లు మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయిల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి వ్యక్తిగత జీవితం, వ్యవహారాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, తాజాగా ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వీరిద్దరి వ్యవహారానికి సంబంధించి ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం అప్పట్లో పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన వైరల్ కావడంతో ఈ జంటపై అనేక చర్చలు, ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ పరిణామాల క్రమంలోనే మాధురి రాథోడ్ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకుని ఈశ్వర్ సాయి తనను మోసం చేశాడని, శారీరకంగా వాడుకుని ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు తన కంప్లైంట్లో ఆరోపించారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించి తన పరువుకు భంగం కలిగించేలా ఫేక్ వీడియోలు సృష్టించి డిజిటల్ వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక బాధితురాలి నుంచి అందిన ఫిర్యాదును పరిశీలించిన నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు తనపై కేసు నమోదు కావడంతో ఈశ్వర్ సాయి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. నిందితుడి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన రెండు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఫోక్ డ్యాన్స్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.