హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్)కు పూర్తిస్థాయి అధికారిని వెంటనే నియమించాలని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు డిమాండ్ చేశా రు. మంగళవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు హరీశ్‌రావును కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రెండు నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేక టీవీవీపీ పరిధిలోని ఎంసీహెచ్, మందుల లభ్యత తదితర అంశాలపై పర్యవేక్షణ కరువైందని ఆందోళన వ్యక్తంచేశా రు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు గైనకాలజీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, పీడియాట్రిక్ తదితర ప్రత్యేక వైద్య సేవలందించే టీవీవీపీ పరిస్థితి గాలిలో దీపంలా మారడం శోచనీయమని మండిపడ్డారు.
సిబ్బంది వేతనాలు, సర్వీస్ సహా ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చి ప్రభుత్వంలో విలీనం చే యాలని గతంలో బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించినట్టు హరీశ్‌రావు గుర్తుచేశారు. మూడేండ్లయినా సర్వీస్ నిబంధనలు రూ పొందించకపోవడం, లక్ష్యం కార్యరూపం దాల్చకపోవడంతో వైద్యులు, సిబ్బంది నిరాశకు గురవుతున్నారని తెలిపారు.