పల్లె ప్రజలు మరోసారి బీఆర్ఎస్ను గుండెల్లో పెట్టుకున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేసినా.. అడ్డంకులు సృష్టించినా బెదరకుండా పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండాకే జైకొట్టారు. కేసీఆర్, కేటీఆర్‌పై చెక్కు చెదరని అభిమానం చూపి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టారు. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభంజనం సృష్టించారు. మొదటి రెండు విడుతల్లోనే కాదు.. మూడో విడుతలోనూ అద్భుత విజయం అందించారు. ‘సిరిసిల్ల గడ్డ.. గులాబీ అడ్డా’ అని మరోసారి నిరూపించారు. సోమవారం రెండు విడుతల్లో గెలిచిన సర్పంచ్‌లను సన్మానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేడు మూడో విడుతలో గెలిచిన సర్పంచ్‌లకు సన్మానం చేయనున్నారు.
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా సాగింది. ప్రభుత్వం మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించగా, కారు ఆది నుంచి జోరు సాగించింది. మొదటి, రెండు విడుతల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్నది. ప్రధానంగా సిరిసిల్ల జిల్లాలో విజయదుందుభి మోగించింది. ఒక్క తంగళ్లపల్లి మండలంలోనే 30 సర్పంచ్ స్థానాలకు 16 స్థానాలను సొంతం చేసుకున్నది. అధికారంలో లేకున్నా పల్లె ప్రజలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 14న సిరిసిల్లలో నూతన సర్పంచులకు సన్మానం చేసి, అండగా ఉంటామని అభయమిచ్చారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడొద్దని, తాము అండగా ఉంటామని, అభివృద్ధిలో ఆదర్శంగా నిలువాలని ధైర్యం చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త సర్పంచుల్లోనే కాదు, మూడో విడుతలో పోటీ చేసే బలపరిచిన అభ్యర్థుల్లో ధీమాను నింపాయి. ఇటు ఆఖరి దఫాలో మెజార్టీ స్థానాలను గెలిపించాలని ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగాయి.
గురువారం సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో 87 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 44 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ 18, బీజేపీ 9 స్థానాలకే పరిమితమయ్యాయి. 16 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, అందులో చాలా మంది గులాబీ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి సొంత మండలమైన ముస్తాబాద్లోనూ ఆ పార్టీ చతికిల పడిపోయింది. అక్కడ బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందగా, వేములవాడ నియోజకవర్గంలోనూకాంగ్రెస్ నేతల ప్రభావం కనిపించలేదు. పల్లెలు, తండాల్లో, మేజర్ పంచాయతీల్లోనూ కారు స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మొత్తంగా జిల్లాలో 260 సర్పంచ్ స్థానాలకు 113 స్థానాలు కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆపార్టీ నేతలు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మలేదు. ఆ పార్టీ 94 స్థానాలే రాగా, ఇక బీజేపీ 22 స్థానాలతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. స్వతంత్రులు 31 స్థానాలను సొంతం చేసుకున్నారు. కాగా, పల్లె ప్రజలు అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గలేదని ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతున్నది.
రెండు విడుతల్లో గెలిచిన సర్పంచులకు ఈ నెల 15న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ ఘనంగా సత్కరించారు. మూడో విడుతలో గెలిచిన సర్పంచులకు నేడు సిరిసిల్లలో సన్మానం చేయనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు.
సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 18 : పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పల్లె జనమంతా గులాబీ జెండాతోనే ఉన్నారని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హర్షం వ్యక్తం చేశారు. రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే సత్తా చాటుతామని, జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు వచ్చిన ఆదరణను తప్పుదోవ పట్టించేందుకు విప్ ఆది శ్రీనివాస్ తామే గెలిచామంటూ చేస్తున్న ప్రగల్భాలు మానుకోవాలని హితవు పలికారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్ చేసిన అభివృద్ధి ఇప్పటికీ మన కండ్ల ముందే కనిపిస్తున్నదని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో జిల్లా ప్రజలు గులాబీ జెండాకు తమ సంపూర్ణ మద్దతును తెలిపారని సంతోషం వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులకు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గట్టి పోటీనిచ్చారని స్పష్టం చేశారు. చాలాచోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు ఓడిపోయినా.. స్వల్ప ఓట్ల తేడానే ఉందని చెప్పారు.

కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని, పంచాయతీ ఫలితాలే అందుకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలన తేలిపోయిందని, పల్లెలు, పట్టణాల్లో ప్రగతి కుంటుపడిపోయిందని విమర్శించారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు అధికారమదంతో అనేకచోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. గ్రామాల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చిన ప్రజలకు తాము అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్‌ను జనతా గ్యారేజ్ తరహాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, సత్తార్, తదితర నాయకులు పాల్గొన్నారు.