రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ను బదనాం చేయాలనే ఉద్దేశంతో సిరిసిల్లలో 8 వేల ఎకరాలు కబ్జా చేశారంటూ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ప్రగాల్భాలు పలికారని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. 8 వేల ఎకరాలకు సంబంధించిన వివరాలను బయటపెట్టి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి సిరిసిల్ల ప్రజలతోపాటు కేసీఆర్, కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పట్టణాధ్యక్షుడు చక్రపాణితో కలిసి ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్లలో 8 వేల ఎకరాలు అన్యాక్రాంతమైందని, ఇందులో 2,400ఎకరాలు రికవరీ చేసినట్టు రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటనకు వచ్చేలోగా 8 వేల ఎకరాలు, రికవరీ చేసిన 2,400 ఎకరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యుల భూ దోపిడీ, 22ఏ నిషేధిత భూములపై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును ఎదుర్కొనే దమ్ములేక రేవంత్ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 8 వేల ఎకరాల వివరాలు ఇవ్వాలని కలెక్టర్‌ను కలిసి కోరారు. సమాచార హక్కుచట్టం ద్వారా వివరాలు ఇవ్వాలని బీఆర్ఎస్ లీగల్ టీమ్‌తో కలిసి డీఆర్వో జయశ్రీకి ఫిర్యాదు చేశారు.