Telangana | నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలు కాకముందు నుంచే అధికార పార్టీ అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతున్నది. ప్రతిపక్ష పార్టీలకు అందనంత వేగంతో ప్రచారం దూసుకుపోతున్నది. విజయమే లక్ష్యంగా సాగిపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో చేసే సరికొత్త ప్రయత్నాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తీన్మార్ తరహాలో ఉన్న ఈ వీడియోలు ఆయా నియోజకవర్గాల్లో వైరల్ అవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఉంటూ వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ విజయమే లక్ష్యంగా సాగిపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు చేస్తున్న తీన్మార్ చప్పుళ్లు, పేరడీ వ్యాఖ్యానాలతో కూడిన వీడియోలకు ఇప్పుడు భలే క్రేజ్ ఏర్పడింది. ‘నవంబర్ 30న అందరి చేతికి ఇంకు… ఆ తర్వాత తెలంగాణ అంతా పింకూ…’ అంటూ మంత్రి మల్లారెడ్డి రూపొందించిన తీన్మార్ వీడియో ఇప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తున్నది. నిజామాబాద్ జిల్లాలోనూ పలువురు ఎమ్మెల్యేలు ఈ ప్రయత్నాన్ని మొదలు పెట్టి విజయవంతంగా వీడియోలను ప్రజల్లోకి వదిలారు. దీంతో ఆయా వీడియోల్లో తమ అభిమాన నాయకుల సందడిని చూస్తూ జనం మురిసిపోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు కలిసి ఆడి, పాడుతూ స్టెప్పులతో కదం తొక్కుతుండడంతో గులాబీ సైన్యంలోనూ జోష్ కనిపిస్తున్నది.
ప్రస్తుతం ‘గులాబీల జెండలమ్మా… కారును గుర్తుంచుకో రామక్క…’ పాట సంచలనంగా మారింది. ఇప్పుడీ పాటను పలువురు ఎమ్మెల్యేలు తమ పేర్లతోనూ ప్రత్యేకంగా రూపొందించుకుంటున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తన ప్రచారంలో రామక్క పాటను సంధించి, జనాలను ఆకట్టుకుంటున్నారు. అయితే, రామక్క పాట పల్లవి, చరణాలను కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టడంపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ను ఫాలో కావడం తప్పా.. ఆపార్టీకి పనేంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తీన్మార్ తరహా వీడియోలు ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన శ్రేణులతో ఈ వీడియోలకు స్టెప్పులు వేశారు. ‘అప్పుడెట్లుండే తెలంగాణ… ఇప్పుడెట్లయింది తెలంగాణ…’ అంటూ ఈ వీడియోలో స్వరం కలిపిన బాజిరెడ్డి తనదైన మార్కును ప్రదర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా సైతం ‘తెలంగాణ రాక మునుపు… వచ్చిన తర్వాత’ అంటూ పద ప్రయోగాల రూపంలో వ్యాఖ్యానాలు చేసి తీన్మార్ చప్పుళ్లతో హల్చల్ చేయడం అందరినీ ఆకట్టుకుంటున్నది. మొత్తానికి తీన్మార్ వీడియోల ప్రయోగం తెలంగాణ అంతటా బీఆర్ఎస్ అభ్యర్థుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదు.
…? జూపల్లి రమేశ్రావు