మహబూబ్‌నగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి విడుత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు మద్దతుగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలు విస్తృతంగా ప్రచారం చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల తరఫున జమిస్తాపూర్ కోటకదిర గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. వనపర్తి నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రచారం చేపట్టి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తాడూరు, తెలకపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. దేవరకద్ర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తొలివిడుత పంచాయతీలో గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. కొల్లాపూర్ కొడంగల్‌లో కూడా మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డిలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టి ఓటు వేయాలని కోరారు. గులాబీ ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనం పలికారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని.. హామీలను నమ్మి మోస పోయామని ఈసారి ప్రభుత్వానికి చెంపపెట్టు అయ్యేలా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తామని ఓటర్లు శపథం చేశారు. గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి అభ్యర్థుల గుర్తులను ప్రచారం చేస్తూ ఓటు వేయాలని కోరారు. ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలకు ఘన స్వాగతం పలికారు. కొన్నిచోట్ల అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలివిడుత పంచాయతీల్లో రేవంత్ ప్రభుత్వానికి చెంప పెట్టు అయ్యేలా తీర్పునివ్వాలని బీఆర్ఎస్ నేతలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఎత్తిపోతల నీళ్లిస్తా..

పెద్దమందడి, డిసెంబర్ 9 : పెద్దమందడి చెరువుకు శంకరసముద్రం (కానాయపల్లి) నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని అందించి తీరుతానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని జగత్పల్లి, మనిగిల్ల, అల్వాల, మోజర్ల తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు సుఖేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, స్వాతి , రాజవర్ధన్రెడ్డిల తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పెద్దమందడి రైతాంగాన్ని ఆదుకోవాలని బుద్ధారం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగునీరు అందించామని, కానీ నీటి సరఫరా సకాలంలో అందడం లేదని యాసంగి వచ్చే వరకు చెరువు ఎండిపోతుందని నిపుణుల ద్వారా అంచనా వేయించి శంకరసముద్రం నుంచి ఎత్తిపోతల పథకం రూపొందించిన రైతుల కష్టాలు తీర్చాలని భావించామని అంతలోనే ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం వల్ల సాధ్యం కాలేదని, అయినా పెద్దమందడి సర్పంచ్‌గా స్వాతిని గెలిపిస్తే ఎత్తిపోతల పథకం సాధిస్తామని రైతాంగ వెతలు తీరుస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం మాయమాట లు చెబుతున్నారని నమ్మవద్దని మాకు ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బెదిరిస్తున్నారని, రెండేండ్లు ఏమి చేయలేని వారు ఇప్పుడేమీ అభివృద్ది చేస్తారని నిలదీయాలని పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా అభివృద్ధి జరుగుతుందని రేవంత్‌రెడ్డి వల్ల ఏమి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలకు శూన్యహస్తం చూపిందని ఎద్దేవా చేశారు. రైతులకు రైతు భరోసా ఎగ్గోట్టిందని, రైతులకు రైతు రుణమాఫీకి దిక్కులేదన్నారు. కేసీఆర్ 46వేల చెరువులు మరమ్మతులు చేయించి రూ.10వేల కోట్లు కరెంట్‌ను కేటాయించి వ్యవసాయాన్ని పండుగా చేసి రూ.50లక్షల కోట్ల సంపద సృష్టించారన్నారు. రేవంత్‌రెడ్డి వచ్చిన రెండేళ్లలో రూ.2లక్షల60వేల కోట్లు అప్పు చేసి ఏమి వెలగబెట్టారని ప్రశ్నించారు. ఇక్కడి నాయకులు సొంత మండలం అని చెప్పి పదేండ్లలో చేయని అభివృద్ధి రెండేళ్లలో చేస్తామని ఒక్క తట్టమట్టి కూడా తీయలేదని, అడ్డం పొడుగు మా ట్లాడం తప్పా చేసిందేమీ లేదన్నారు.
నియోజకవర్గానికి జిల్లా చేయించి కలెక్టరేట్ తేవడం ద్వారా పరిపాలన సౌలభ్యం జరిగిందన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం ద్వారా వేలాది మంది పురుడు పోసుకొని రూ పాయి ఖర్చు లేకుండా కేసీఆర్ కిట్టుతో సం తోషంగా ఇంటికి వెళ్లేవారని నేడు వసతులు లేక ప్రజలు ప్రైవేట్ దవాఖానలు ఆశ్రయించి నిలువు దోపిడీకి గురవుతున్నారన్నారు. గ్రామాల్లో పచ్చదనం , పరిశుశ్రత కోసం కొత్తగా కార్మికులను నియమించి, కొత్త ట్రాక్టర్లు, ట్రాలీలు ఏర్పాటు చేసి చెత్త సేకరించి పరిశుభ్రంగా ఉంచామని, పచ్చదనం కోసం మొక్కలు నాటి పార్కులు ఏర్పాటు చేశామని, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేశామని, పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నదని అన్నారు.
నేడు కాంగ్రెస్ పాలనలో కార్మికులకు జీతాలు లేక, ట్రాక్టర్లకు డీజిల్ పోసే దిక్కు కూడా లేక దీనంగా మారిందని విమర్శించా రు. హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ నాయకుల గల్లాపట్టి నిలదీయాలన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, గ్రామాల అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టుయాదవ్, జగదీశ్వర్‌రెడ్డి, పలుస రమేశ్‌గౌడ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, బండారు కృష్ణ, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, స్టార్ రహీం, గులా ంఖాదర్, ఇమ్రాన్, అరీఫ్, మంద రాము, అనిపాటి రాము, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.