బీబీనగర్, సెప్టెంబర్ 30 : మూసీ వరద ఉధృతికి బీబీనగర్ మండల పరిధిలోని రుద్రవెల్లి గ్రామం వద్ద గల వంతెనపై గల రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. దీంతో బీబీనగర్ – పోచంపల్లి మండలాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణం ప్రారంభమై పిల్లర్ల వరకే పనులు జరిగి ఆగిపోయాయి. దీంతో రెండు మండలాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రజా ప్రతినిధులు అధికారులు వంతెన నిర్మాణం పునఃప్రారంభించి పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా వాహన రాకపోకలు నిలిపివేయడంతో అనేక అవస్థలు పడుతున్నారు. పండుగల వేళ రెండు మండలాల మధ్య ప్రధాన రహదారి దెబ్బతినడంతో ఇరు మండలాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంతెన నిర్మాణం చేపడతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం, ఉన్న బ్రిడ్జి దెబ్బ తినడంతో ప్రజలు నానా అవస్థలు పడటం పరిపాటిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ మార్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడం వల్ల ప్రజలు అవస్థలకు గురికావాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం పట్టించుకుని స్తంభించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Bibinagar : మూసీ ఉధృతికి దెబ్బతిన్న వంతెన.. బీబీనగర్- పోచంపల్లి మధ్య నిలిచిన రాకపోకలు