కోటగిరి, జూలై 31: పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతంలాంటివి. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తల్లిపాలు చాలా ప్రధానం. అందుకే తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఆరు నెలల వరకు బిడ్డ శరీర అవసరాలన్నీ తల్లిపాల ద్వారానే తీరుతాయి. ఈ విషయాలు గర్భిణులు, తల్లులకు తెలిసేలా ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించనున్నది.
బిడ్డకు అమ్మ పాలు సురక్షితం. ఎన్నో పోషకాలు అందించి, రోగాల నుంచి రక్షించే అమృతం వంటివి. పోతపాల కన్నా తల్లిపాలు తాగే పిల్లలు బలంగా , తెలివిగా ఉంటారన్నది నిరూపితమైంది. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా.. వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని పొందాలన్నా.. తల్లి పాలు పట్టించాల్సిందే. ఎంతో విశిష్టత కలిగిన తల్లిపాలను బిడ్డ ఎంత వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి..? రోజుకు ఎన్నిసార్లు పాలు పట్టాలి..? తల్లిపాలు పుష్కలంగా రావాలంటే ఏమి తినాలి..? ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి? తదితర అంశాలపై అందరికీ అవగాహన ఉండదు. ఇలాంటి విషయాలపై వారికి అవగాహన కల్పిస్తూ తల్లిపాల ప్రాముఖ్యత చాటేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వారోత్సవాలను నిర్వహించనున్నారు.
ఏటా తల్లిపాల వారోత్సవాలను ఆగస్టు మొదటి వారంలో నిర్వహిస్తారు. వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయనున్నారు. తల్లిపాలతో పాటు గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించనున్నారు. గ్రామాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు కేంద్రాల పరిధిలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ చేపట్టనున్నారు. తల్లిపాలలోని పోషకాలు, తల్లీబిడ్డలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తారు.