న్యూఢిల్లీ : తాను బౌద్ధమతాన్ని ఆచరిస్తానని, కానీ అన్ని మతాలను నమ్మే నిజమైన లౌకిక వాదినని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్న ఆయనకు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవాయ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశ న్యాయ వ్యవస్థ తనకు ఎంతో ఇచ్చిందన్నారు.
తాను బౌద్ధమతాన్ని ఆచరిస్తానని, అయితే మతపరమైన విధానాలపై తనకు లోతైన అవగాహన లేదని చెప్పారు. తాను నిజమైన లౌకిక వాదినని, అందుకే తనకు బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం, సిక్కుమతం ఇలా ప్రతి దానిపై విశ్వాసం ఉందని తెలిపారు. అంబేద్కర్, రాజ్యాంగం కారణంగానే తానీ ఉన్నత స్థితికి చేరుకున్నానని ఆయన చెప్పారు.