శబరిమల : శబరిమలకు మంగళవారం ఒక్క రోజే రెండు లక్షల మంది భక్తులు పోటెత్తిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్(టీడీబీ) బుధవారం నుంచి భక్తుల రాకపై పరిమితి విధించింది. గురువారం కేరళ హైకోర్ట్ ఆదేశాల మేరకు స్పాట్ బుకింగ్‌ను రోజుకు 5 వేలకు పరిమితం చేసింది. ఈ బుకింగ్ కేవలం నీలక్కల్, వండిపెరియార్ కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నెల 24 వరకు పంబ, ఎరుమేలి, చెంగనూర్లలో తాత్కాలికంగా ఈ బుకింగ్ సేవలను నిలిపేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది.
వీలైనంత వరకు వర్చువల్ క్యూ విధానంలో దర్శనం స్లాట్ బుక్ చేసుకోవాలని భక్తులకు టీడీబీ విజ్ఞప్తి చేసింది. వారికి కేటాయించిన తేది, సమయంలోనే దర్శనానికి రావాలని కోరింది. శబరిమలలో రద్దీ తగ్గించడం కోసం నీలక్కల్లో యాత్రికులకు రాత్రి బస ఏర్పాటు చేసి వారికి మరుసటి రోజు దర్శనం ఏర్పాట్లను చేసింది. రద్దీకి అనుగుణంగా ఇప్పుడున్న సౌకర్యాలు సరిపోవని హైకోర్ట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్స్‌లతో పాటు మరక్కూట్టమ్-సరంకుతి-సన్నిధానంలో మంచి నీళ్లు, కొద్దిగా భోజనం, చుక్కు కాఫీని టీడీబీ యాత్రికులకు అందిస్తున్నది.