న్యూఢిల్లీ, నవంబర్ 20 : మీ బంధువులనో, స్నేహితులనో కలవడానికి ఏదైనా హౌసింగ్ సొసైటీకి వెళ్లాలనుకుంటున్నారా, ఏదైనా రెస్టారెంట్లో జరిగే లైవ్ ఈవెంట్‌కు హాజరవ్వాలనుకుంటున్నారా? అయితే ఆయా ప్రదేశాలలోకి ప్రవేశించేందుకు మీరు నిర్వాహకులకు తప్పక ఆధార్‌ను చూపించాల్సి ఉంటుంది. మీరు ఒక వేళ విద్యార్థి అయితే మీరు పరీక్షకు హాజరయ్యే ముందు కూడా ఈ గుర్తింపు కార్డును చూపమని అడగవచ్చు. అయితే మనం ఇచ్చే ఫొటో కాపీలు, ఆధార్ హార్డ్ కాపీలు దుర్వినియోగం అవుతాయని మనకు భయం ఉంటుంది. దీనిని అధిగమించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొత్త విధానాన్ని తెస్తున్నది. ఇకపై కొత్త కార్డుపై క్యూఆర్ కోడ్, మీ ఫొటో మాత్రమే ఉంటాయి.
ఇతర వివరాలుండవు. దీని ద్వారా మీ ఆధార్ ఇకపై దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ఆఫ్‌లైన్ ఆధార్ విధానంపై పనిచేస్తోంది. దీని ద్వారా ఇక నుంచి మీరు ఏదైనా సంస్థ లేదా ప్రదేశంలోకి ప్రవేశించే ముందు మీ గుర్తింపును యాప్ ద్వారా తనిఖీ చేస్తారు. ఈ కొత్త ఆఫ్‌లైన్ విధానం మీరు ఇకపై ఆధార్ ఫొటోకాపీలు, జిరాక్స్‌లు చూపించాల్సిన అవసరాన్ని తప్పిస్తుందని యూఐడీఏఐ తెలిపింది. ఇది మీకు ప్రస్తుత ఫొటోకాపీ ఉంచుకోవాల్సిన అవసరాన్ని తప్పించడమే కాక, మీ ప్రైవసీ రక్షణకు ఉపయోగపడుతుందని పేర్కొంది.