నల్లబెల్లి : శిథిలావస్థకు చేరిన బీసీ హాస్టల్ భవనానికి మరమ్మతులు చేపట్టాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ డిమాండ్ చేశారు. అలాగే నూతన భవనం మంజూరు అయ్యేంతవరకు బీసీ హాస్టల్ విద్యార్థులను ఎస్సీ హాస్టల్లోకి మార్చాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పాలతకు వినతి పత్రం అందజేశారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన బీసీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడం వలన విద్యార్థులు భయం గుప్పెట్లో ఉంటూ ఎప్పుడు భవన పైనుండి పెచ్చులు ఊడి పడతాయని భయంతో కాలం వెలదీసే పరిస్థితి నెలకొందన్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న క్రమంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు హాస్టల్ భవనం శిథిల వ్యవస్థ ఉండడంతో హాస్టల్లో ప్రవేశం పొందేందుకు సానుకూలంగా లేకపోవడంతో విద్యార్థులు వేరొక చోటకు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. అధికారులు నూతన భవనం ఏర్పాటు చేసేంతవరకు నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న ఎస్సీ హాస్టల్ భవనంలోకి మార్చి హాస్టల్ విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా బీసీ సంక్షేమ జిల్లా అధికారిని ద్వారా జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ మాజీ జిల్లా అధ్యక్షులు శనిగపురపు రాజేంద్రప్రసాద్, వీహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు పులి రమేష్, శ్రీకాంత్ భరత్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.