ఆర్.సి.కృష్ణస్వామిరాజు కథలు మానవత్వపు పరిమళాలను వెదజల్లుతాయి. 21 కథలతో తాజాగా వెలువరించిన కథా సంపుటి ‘జక్కదొన’ కూడా అలాంటిదే. ‘జక్కదొన’ గొర్రెల కాపర్ల జీవితంతో ముడిపడింది. ప్రాణాలంటే మనుషులవి మాత్రమే కాదు.. మూగజీవాలవి కూడా అని ఈ కథ చాటుతుంది. ఎర్రమట్టి, పొట్టిగుట్టలు కథలు కూడా జీవకారుణ్యం ప్రధానంగా సాగుతాయి. మనిషి ఏ రంగంలో రాణించాలన్నా విద్యావంతుడై ఉండాలి. ‘బుడబుక్కల బంగారుతల్లి’, ‘ఫుల్‌మీల్స్’, ‘గోల్కొండ చూసొద్దాం, రారండి!!’ కథలు మనిషి ఎదగడానికి చదువు ఎంతో అవసరమనే విషయాన్ని వెల్లడిస్తాయి. మంచిపని కోసం ఒక్కరు ఒక్క అడుగు ముందుకు వేస్తే సమాజం వారి వెన్నంటి నిలుస్తుందని ‘రైట్… రైట్’, ‘నగరి ముక్కు’, ‘తొలి అడుగు’ కథలు తేటతెల్లం చేస్తాయి.
‘డిపాజిట్’, ‘L బోర్డు’ కథల్లో నాయికలు స్త్రీలు అన్ని రంగాల్లో రాణించగలరని స్ఫూర్తినిస్తారు. ‘డబ్బు పాపిష్టిది’ కథలో అత్యాధునిక వసతులతో హాస్పిటల్ కట్టి అప్పులపాలై ప్రాణాల మీదికి తెచ్చుకున్న వైద్యుడి జీవితాన్ని ఆర్ద్రంగా ఆవిష్కరించారు. ఇది ధనవంతుల జీవితాల్లో రెండో పార్శాన్ని కండ్లకు కడుతుంది.‘అంజేరమ్మ కనుమ’ బైక్‌లు నడిపేవాళ్లు హెల్మెట్ తప్పకుండా ధరించాలనే సందేశాన్ని ఇస్తుంది. ‘జక్కదొన’ కథల నేపథ్యం చాలావరకు తిరుపతి, పుత్తూరు పరిసర ప్రాంతాలే అయినప్పటికీ, ఇవి అన్ని ప్రాంతాల వారికీ దయ, కరుణ, ప్రేమ, జీవితంపట్ల, సమాజంపట్ల బాధ్యతల ఆవశ్యకతను తెలియజేస్తాయి.