సందడిగా జ్యోతీరావ్ ఫూలే ఉద్యానవనం హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన కవులు, కళాకారుల ఖిల్లా కరీంనగర్లో ‘పుస్తక మహోత్సవం’ మొదలైంది. అందుకు జిల్లా కేంద్రంలోని ఫూలే మైదానం వేదికైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను బుధవారం మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించడం.. పుస్తక ప్రియులకు పండుగను తెచ్చింది. ఈ నెల 8వ తేదీ వరకు బుక్ ఫెయిర్‌ను నిర్వహించనుండగా, మొదటి రోజు పెద్దసంఖ్యలో తరలివచ్చిన సాహితీ ప్రియులు, విద్యార్థులతో సందడి కనిపించింది. చిన్న పిల్లలు ఇష్టపడే కథల పుస్తకాల నుంచి మొదలు.. పెద్దలు ఇష్టపడే సాహిత్యం, నవలలు, చరిత్ర, బయోగ్రఫీ, సైన్స్‌ఫిక్షన్ ఇలా వేలాది పుస్తకాలు ఒకే చోట లభించడంతో హర్షం వ్యక్తమైంది.
కమాన్ చౌరస్తా, మార్చి 2 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు ఫూలే ఉద్యానవనం సందడిగా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కరీంనర్ పుస్తక మహోత్సవం పుస్తకప్రియులకు పండుగను తెచ్చింది. బుధవారం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ సునీల్ రావుతో కలిసి రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బుధవారం పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం కరీంనగర్‌కు జిల్లాకు సంబంధించి సాహితీ సోపతి స్టాల్‌ను ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినులు నృత్యాలతో అలరించారు. ఎల్ఎండీ కాలనీ జ్యోతిబా ఫూలే పాఠశాలకు చెందిన విద్యార్థిని అభినయ పాడిన పాట ఆకట్టుకున్నది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అమ్మా నాన్న ప్రేమపై రాసిన పాటను వేదికపై వినిపించగా, ఆ పాట అందరినీ ఆలోచింపజేసింది.
కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని బుధవారం రాత్రి 7గంటల తర్వాత బుక్ ఫెయిర్‌ను సందర్శించారు. ముందుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్టాల్‌ను ప్రారంభించారు. అనంతరం మిగతా స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బొమ్మ హేమాదేవి వేదికపై ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. అనంతరం అతిథులకు పుస్తకాలను బహుమతిగా అందజేసిన అనంతరం తెలంగాణ వంటకాల స్టాల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 35 ఏండ్లలోపు విద్యార్థులు, యువతీ యువకుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేందుకు ఏర్పాటు చేసిన అమెజాన్ కిండిల్ లకీ డ్రా బాక్స్‌ను ప్రారంభించారు. దీనిని గురువారం నుంచి అమల్లోకి తేనున్నారు. పుస్తక ప్రదర్శనను సందర్శించిన 35 ఏండ్లలోపు వారు తమ పేరు, చిరునామా, కాంటాక్ట్ నంబర్ రాసి డ్రా బాక్స్‌లో వేస్తే.. ప్రతి రోజూ లకీ డ్రా తీసి ఒకరికి రూ. 8 వేల విలువైన అమెజాన్ కిండిల్ ఈ-బుక్ రీడర్‌ను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ కుమార్, సీడబ్ల్యూసీ అధ్యక్షురాలు ధనలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, సాహితీ వేత్తలు గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేం దర్, గాజుల రవీందర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్, కరీంనగర్ బుక్ ఫెయిర్ కోఆర్డినేటర్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
బుక్ ఫెయిర్‌లో 50 స్టాళ్లను ఏర్పాటు చేసి వేల సంఖ్యలో పుస్తకాలను అందుబాటులో ఉంచారు. చిన్న పిల్లలు ఇష్టపడే కథల నుంచి పెద్దలు ఇష్టపడే లిటరేచర్ పుస్తకాల వరకు.. చరిత్ర, జీవిత చరిత్రలు, భాషా సాహిత్యం, బాలసాహిత్యం, విద్య, వైద్యం, సైన్స్ ఫిక్షన్, కథలు, నవలలు, సమకాలీన రాజకీయాలు, వ్యక్తిత్వ వికాసం, ఇంగ్లిష్ గ్రామర్, డిక్షనరీలు.. ఇలా అన్ని రకాల పుస్తకాలు ఒకే చోట ఉంచారు. మొదటి రోజు కవులు, రచయితలు, పుస్తక ప్రియులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. స్టాళ్లను పరిశీలిస్తూ.. పుస్తకాలను ఆసక్తిగా తిలకిస్తూ.. తమకు నచ్చిన వాటిని సంబురంగా కొనుగోలు చేశారు. కరీంనగర్‌లాంటి ప్రాంతంలోనూ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
చదవడం అలవర్చుకోవడం గొప్ప శక్తి. అది అలావాటైతే ఏ విషయమైనా తెలిసి పోతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని కరీంనగర్లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయం. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పుస్తకప్రియుడు. ఆయన ప్రోత్సాహంతోనే కరీంనగర్లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. పుస్తకాలతో జ్ఞానం అలవడుతుంది. విలువలు పెరుగుతాయి. ఈ నెల 4వ తేదీన సాహిత్య అకాడమీ పక్షాన అన్ని పాఠశాలల్లో ‘మన ఊరు -మన చెట్టు’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాం.
– జూలూరు గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్
ఇంట్లో పుస్తకాలు ఉంటే ఇంటికి వెలుగు వస్తుంది. పిల్లలకు పుస్తకాలు కొనిచ్చి చదవడం అలవాటు చేయించాలి. దీనివల్ల పిల్లలు విజ్ఞానం పెంపొందించు కుంటారు. పుస్తకాలు చదవడం వల్ల మంచే జరుగుతుంది. కానీ నష్టం జరుగదు. బాలికలను ఉన్నతంగా చదివించాలి. విజ్ఞానంతో కూడిన సమాజం ఆరోగ్యవంతంగా మారుతుంది.
– బుర్రా వెంకటేశం, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి