ముంబై, జనవరి 1: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. కొత్త సంవత్సరం తొలిరోజు ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ నష్టపోగా.. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ లాభపడింది. నిజానికి ఉదయం ఆరంభంలో రెండు ఇండెక్స్లూ లాభాల్లోనే కదలాడాయి. అయితే సమయం గడిచినకొద్దీ మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే చివరకు సెన్సెక్స్ 32 పాయింట్లు లేదా 0.04 శాతం పడిపోయి 85,188.60 వద్ద నిలిచింది.
మరోవైపు నిఫ్టీ 16.95 పాయింట్లు లేదా 0.06 శాతం పెరిగి 26,146.55 వద్ద స్థిరపడింది. విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ నష్టాలు.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాలుంటాయంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన.. సిగరెట్ తయారీ సంస్థలైన గాడ్ఫ్రే ఫిలిప్స్, ఐటీసీ స్టాక్స్‌ను కుదిపేసింది.
ఈ ఒక్కరోజే గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్ వాల్యూ 17.09 శాతం పతనమవగా.. ఐటీసీ షేర్ విలువ 9.69 శాతం క్షీణించింది. అలాగే బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లూ నష్టపోయాయి. అయితే బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.27 శాతం పెరిగితే, స్మాల్‌క్యాప్ 0.02 శాతం దిగింది. రంగాలవారీగా ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు-గ్యాస్ షేర్లు నిరాశపర్చాయి.