నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్( Narnoor ) , గాదిగూడ ( Gadiguda ) మండలాల్లో శనివారం బోడగ వేడుకలను (Bodaga celebrations ) ఘనంగా నిర్వహించారు. డప్పు, వాయిద్యాల మధ్య ఖొడంగ్లతో ఊరేగించారు. ‘ జాగీ మా తరి జాగే ’ అంటూ నినాదాలు చేస్తూ గ్రామ సమీపంలోని పొలిమేర శివారుకు ఆదివాసులు వెళ్లారు. శివారులోని పొలిమేరలో ఖొడంగ్ లకు ఆదివాసి సాంప్రదాయ పూజలు నిర్వహించారు.
పొలాల అమావాస్య సందర్భంగా ఇంటింటికి తయారు చేసిన పిండి వంటలను సేకరించారు. నైవేద్యంగా వనదేవతకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అటవీ ప్రాంతంలో లభించే రకరకాల వనమూలికలను వెంట తీసుకొచ్చారు. దుష్టశక్తుల బారిన పడినప్పుడు ఈ వనమూలికలతో పొగ పెడితే దుష్టశక్తులు పారిపోతాయని వారి నమ్మకం. పిండి వంటలను ఒకచోట సేకరించి ఫలాహారంగా ఆదివాసులు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు ఉన్నారు.