Teeth | టోక్యో, మే 31: ఒకసారి దంతాలు ఊడిపోతే మళ్లీ తిరిగి రావు. కృత్రిమ దంతాలతోనే నెట్టుకురావాలి. అయితే, ఈ అవసరం లేదని, దంతాలు ఊడిన చోట కొత్త దంతాలు పెరగడం సాధ్యమే అంటున్నారు జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు. క్యోటో యూనివర్సిటీ అనుబంధ స్టార్టప్ టొరెగెమ్ బయోఫార్మా.. ఒక యాంటీబాడీ డ్రగ్‌ను తయారుచేసింది. సాధారణంగా వయసు పెరిగిన తర్వాత దంతాల పెరుగుదలను ఉటెరిన్ సెన్సిటైజేషన్-అసోసియేటెడ్ జీన్-1(యూఎస్ఏజీ-1) అనే ప్రొటీన్ నిలిపివేస్తుంది.
ఈ ప్రొటీన్‌ను తాము తయారుచేసిన డ్రగ్ లక్ష్యంగా చేసుకొని డీయాక్టివేట్ చేస్తుందని, తద్వారా దంతాలు మళ్లీ పెరగడానికి ఉన్న అడ్డంకిని తొలగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని ఎలుకలపై ప్రయోగించగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దంతాలు పెరిగాయని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో మనుషులపై కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నామన్నారు.