న్యూఢిల్లీ, జూన్ 19: దాదాపు 200 డ్రోన్లతో ఉక్రెయిన్ రష్యా రాజధాని మాస్కోలోని రిఫైనరీపై దాడి చేసిన నేపథ్యంలో మాస్కోలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం నల్లటి చమురు బిందువులతో కూడిన వర్షం కురిసింది. పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద దాడి తర్వాత దగ్ధమైన రిఫైనరీ నుంచి దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి.
ఈ ఘటనలో 17 మంది గాయపడినట్లు స్థానిక గవర్నర్ ఆండ్రీ వొరోబియోవ్ తెలిపారు. సన్నని చినుకుల వల్ల తమ దుస్తులపై నల్లని మరకలు పడ్డాయని మాస్కో ఆగ్నేయ భాగంలో నివసించే ప్రజలు బీబీసీకి తెలిపారు. అయితే చమురు వర్షం పడిందన్న వాదనలను ప్రభుత్వ అధికారులు తోసిపుచ్చారు. కాగా ప్రభావిత ప్రాంతంలోని నివాసితులు తమ కిటికీలను మూసి ఉంచాలని నగర అధికారిక టెలిగ్రామ్ చానల్ హెచ్చరించింది.
అలాగే పిల్లలు, వృద్ధులు, ఆస్తమా ఉన్నవారు ఆ ప్రాంతం నుంచి తక్షణమే వెళ్లిపోవాలని సూచించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,000 డ్రోన్లు, నాలుగు ఉక్రేనియన్ క్రూయిజ్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. దక్షిణ రోస్తోవ్ ప్రాంతంలోని ఒక చమురు డిపోపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. అయితే గతవారం కీవ్లోని ఒక ప్రముఖ మతపర కట్టడమైన ఫెచెర్స్ లావాను దహనం చేసిన రష్యా చర్యకు ప్రతిస్పందన గానే డ్రోన్ దాడి జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. మా ఇల్లు తగలబడితే మీ ఇల్లూ తగలబడుతుందని ఆయన రష్యాను హెచ్చరించారు.