న్యూఢిల్లీ, డిసెంబర్ 6: బ్లాక్ బాక్స్.. ఈ పేరు వినే ఉంటారు.. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా దీని గురించి మాట్లాడుతుంటారు. ప్రమాదంలో విమానం, హెలికాప్టర్లు క్రాష్ అయిపోయినా బ్లాక్ బాక్సుల్లో ఉండే సమాచారం తొలగిపోదు. ప్రమాదానికి గల కారణం, ప్రమాదానికి ముందు ఏం జరిగింది.. తదితర సమాచారం అంతా ఈ బ్లాక్ బాక్సులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్తు ప్రమాదాలను నిరోధించవచ్చు. ఇదే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు భూమి కోసం ఓ బ్లాక్ బాక్సును తయారు చేస్తున్నారు. టాస్మేనియాలోని పశ్చిమ తీరంలో దీని నిర్మాణం జరుగుతున్నది. ప్రకృతి విధ్వంసంలో మానవ పాత్రను రికార్డు చేయడానికి, భవిష్యత్తు తరాలకు సమాచారం చేరవేయడానికి ఈ బ్లాక్ బాక్సును తయారుచేస్తున్నారు. జీవజాతుల మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంత అవసరమో తెలియజేయాలన్నది శాస్త్రవేత్తల ఉద్దేశం.
ఎలా ఉంటుందంటే..
ఈ బ్లాక్ బాక్సు స్కూల్ బస్సు సైజులో ఉంటుంది. చుట్టూ మూడు అంగుళాల మందమైన ఉక్కు కోటింగ్ ఉంటుంది. పైన సౌర పలకలు ఉంటాయి. లోపల డాటా స్టోరేజీ పరికరాలు ఉంటాయి. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయ్యాక వాతావరణంలోని కర్బన స్థాయిలు, ఉష్ణోగ్రతల్లో మార్పులను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది. దీనిలో ఉండే ప్రత్యేకమైన అల్గారిథం ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ నుంచి అధీకృత సమాచారాన్ని సేకరిస్తుంది.