గుర్రంపోడు, జనవరి 17: త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకటి లేదా రెండు రాష్ట్రాల్లో మాత్రమే గెలువనున్నదని, మిగతా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలకే అధికారం దక్కనున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నా రు. నల్లగొండ జిల్లా గుర్రంపోడులో సోమవారం మీడియా సమావేశంలో గుత్తా మాట్లాడారు. రాష్ట్రంలో మూడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచిన బీజేపీ.. వాపును చూసి బలుపు అనుకుంటున్నదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు కూడా రావని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడే లేడని, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులంతా పీసీసీ పదవి కోసం కొట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. నల్లగొండ జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ఎదిగిందని, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్కు కంచుకోటగా మారిందని పేర్కొన్నారు. త్వరలోనే రూ.89 కోట్లతో ఏకేబీఆర్ నుంచి పాల్వాయి చెరువుకు లిఫ్టు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.