మనిషన్నవాడు మాట మీద నిలబడతాడు. ఎవరైనా ఓ మాట మాట్లాడేముందు బాగా ఆలోచించుకొని మాట్లాడాలి. కానీ.. మన రాష్ట్రంలో బీజేపీ నేతలకు ఇవేవీ పట్టవు. ‘ఎప్పటికయ్యెది ప్రస్తుతమప్పటికా మాటలాడి.. తప్పించుకు తిరుగువాడు’ అని అప్పుడెప్పుడో సుమతి శతకం రాసినాయన అన్న మాటను అచ్చు గుద్దితే.. బీజేపీ నేతల ముఖమే కనిపిస్తుంది. వాళ్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. చేతికెంతొస్తే అంత బురద జల్లుతారు. మీరే కడుక్కోండి అంటారు. ఒక ఆరోపణ చేస్తరు. అది అబద్ధమని తేలేసరికి తోకముడుస్తరు. మళ్లీ ఆ మాటెత్తరు.. వెంటనే కొత్త రాగం తీస్తరు.. హిట్ అండ్ రన్ అంటే ఇదేనేమో!
తాము చేసిన ఏ ఒక్క ఆరోపణపైనా పట్టుమని 24 గంటలైనా నిలబడలేని బీజేపీ నేతలు.. సోమవారం నుంచి సరికొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని సమాచారం. వానకాలం పంట కొనుగోళ్లు సాగుతున్న ఐకేపీ కేంద్రాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, గడ్డిపల్లి, ఆత్మకూరు, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరితో పాటు జనగామ జిల్లాలో ఐకేపీ కేంద్రాలను చూసి అక్కడ నయా పొలిటికల్ డ్రామా వేయడానికి స్కెచ్ వేశారని తెలిసింది. ఇప్పటికే ఈయన గురించి, ఈయన పార్టీ గురించి రైతులకు పూర్తి అవగాహన వచ్చింది. ఈయన సంగతి రైతులే చూసుకొంటారు. తగిన గుణపాఠం చెప్తారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): నోటికొచ్చిందల్లా అనాలి.. ఇదేమని అడిగితే.. పారిపోవాలి! ఇదీ రాష్ట్ర బీజేపీ నేతల నైజం. తాము చేసిన ఆరోపణ తప్పు అని ఎదుటి పక్షం ఆధారాలతో సహా చూపించేసరికి నోర్లు మూతబడతయి. ఆ ఆరోపణలపై చర్చిద్దాం రమ్మని సవాలు విసిరితే పారిపోతరు. ఏ ఒక్క మాటకూ కట్టుబడరు. పూటకోమాట.. రోజుకో ఆరోపణ.. దేనికీ కట్టుబడరు. ప్రతి ఆరోపణా అవాస్తవమే. ప్రతి దాని వెనుకా దురుద్దేశమే. ప్రజలను మభ్యపెట్టాలి.. గాయిగత్తర చేయాలి. అయోమయానికి గురిచేయాలి.
ఆరోపణ అబద్ధమని తేలేలోగా మరో కొత్త డ్రామా మొదలుపెట్టి పాతదానిపై నివురు గప్పాలి. ఏమైనా సరే.. అప్పటికి తాత్కాలికంగా పబ్బం గడిచిపోతే చాలు.. అక్కడక్కడా నాలుగు ఓట్లు రాలి.. రాజకీయంగా లబ్ధి పొందితే చాలు. తెలంగాణ ఉద్యమకాలం నాటి నుంచి కూడా ఈ రకమైన ప్రతిపక్షాల రాజకీయం తెలంగాణ సమాజానికిఅపరిచితం ఏమీ కాదు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే రాజకీయాన్ని కాంగ్రెస్, బీజేపీ కొనసాగించాయి. అడ్డగోలు ఆరోపణలతో ప్రజానీకాన్ని మభ్యపెట్టాలని చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ప్రగతి నివేదన’తో ప్రజలముందుకు వెళ్తే.. బ్రహ్మాండంగా ఆశీర్వదించి మరోసారి పట్టం కట్టారు.
ఇప్పుడు ఈ కూటనీతి రాజకీయం మరీ పేట్రేగిపోయింది. రాజకీయం అంటే పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవచ్చు. కానీ.. ప్రజల ప్రయోజనాలకు సంబంధించి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తేనే రాష్ర్టానికి, సమాజానికి మేలు. బీజేపీ మాత్రం ‘రాక్షసంగా జనానికి కీడుచేసే యంత్రాంగం’ అన్నట్టు దారుణంగా మారిపోయింది. వీళ్ల అడ్డగోలు ఆరోపణలకు ముఖ్యమంత్రి దాకా దేనికి.. మంత్రులు, ఎమ్మెల్యేలు విసిరిన సవాళ్లకు కూడా జవాబు చెప్పలేక తోకముడిచారు. తేలుకుట్టిన దొంగల్లా.. వీరి వ్యవహారం ఎలా ఉన్నదో వాళ్ల ఆరోపణలు, టీఆర్ఎస్ నేతల సవాళ్లు.. వీళ్ల జవాబులు ఏమిటో మీరే చదవండి..
రాష్ట్రంలో గొర్రెల పథకానికి ఇచ్చిన నిధులు
కేంద్రానివే: బండి సంజయ్ (08-11-2021, హైదరాబాద్)
సీఎం కేసీఆర్ సవాలు (08-11-2021)
దేశాన్ని పాలించే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడై ఉండి బండి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. గొర్రెల పైసలు మేము ఇచ్చినవే అని నవ్వి పొదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా మాట్లాడుతుండు. దీంట్లో ఏకాణ పైసా కేంద్రానిది ఉన్నట్టు చూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా.
సంజయ్ జవాబు చెప్పకుండా పారిపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇచ్చే నిధులు కేంద్రానివే: బండి (10-07-2021, బాల్కొండ)
రాష్ర్టానికి కేంద్రం ఇచ్చిన నిధులు రూ.2.71 లక్షల కోట్లు: బండి సంజయ్(16-09-2021, కామారెడ్డి)
సవాలు: సీఎం కేసీఆర్ (08-11-2021, హైదరాబాద్)
ఏడేండ్ల కాలంలో కేంద్రం ఇచ్చిన నిధులు 42 వేల కోట్లు మాత్రమే. నరేగా (ఉపాధి హామీ పథకం), నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం), సర్వ శిక్షా అభియాన్ ఈ మూడు పథకాలకు తప్ప కేంద్రం.. ఇతరత్రా ఒక్క రూపాయి ఇవ్వదు. అన్ని రాష్ర్టాలకు ఇచ్చినట్టే మనకు కూడా వస్తుంది. బ్యాక్వర్డ్ రీజయన్ డెవలప్మెంట్ ఫండ్ కింద రాష్ర్టానికి 450 కోట్లు రావాలి. మాటలు మాట్లాడటం కాదు.. వీరికి చేతనైతే ఈ నిధులను తీసుకొనిరావాలి. చట్ట ప్రకారం ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలి. వీరి ముఖానికి ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల అయినా తెచ్చిండ్రా?
సంజయ్ జవాబు చెప్పకుండా పారిపోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కానీ, కేంద్రం నుంచి నిధులు కానీ ఇవ్వకపోవడానికీ 80 వేల కోట్ల అవినీతి జరగడమే కారణం. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను కూడా రాష్ట్రం కేంద్రానికి ఇవ్వలేదు: బండి సంజయ్(10/01/2021, వరంగల్)
సవాలు: సీఎం కేసీఆర్ (08-11-2021)
దమ్ముంటే ఎంక్వైయిరీ వేయించు.. విచారణకు సిద్ధంగా ఉన్నాం.
సంజయ్ జవాబు చెప్పలేదు. పారిపోయారు.
వరి వేయండి ఎలా కొనరో చూస్తాం: బండి సంజయ్ (07-11-2021, హైదరాబాద్)
సవాలు: సీఎం కేసీఆర్ (08-11-2021)
మీ రాజకీయాల కోసం రైతులను బలి చేద్దామనుకుంటున్నారా? చేతనైతే.. ఢిల్లీకి వెళ్లి, వరి కొంటామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ తీసుకురా? అది తెస్తే రైతులకు నీళ్లు, విత్తనాలు కూడా మేమే ఇవ్వడానికి సిద్ధం.
సంజయ్ జవాబు చెప్పలేదు. పారిపోయారు.
బీబీనగర్ ఎయిమ్స్‌ను కేంద్రం అభివృద్ధి చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది: బండి (19-07-2021, హైదరాబాద్)
మెడికల్ కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అధికారులతో మాట్లాడిందా? ఎయిమ్స్‌కు పూర్తిగా స్థలం ఇవ్వలేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(10-11-2021, హైదరాబాద్)
సవాలు.. సమాధానం: హరీశ్‌రావు (11-11-2021)
సీఎం కేసీఆర్ జనవరి 20, 2015న బీబీనగర్ నిమ్స్‌ను సందర్శించి, ఆ భవనాలతో సహా మొత్తం ఎయిమ్స్ కోసం ఇచ్చారు. మే 10, 2020న బీబీనగర్ తాసిల్దార్ కే వెంకట్‌రెడ్డి ఎయిమ్స్ డైరెక్టర్‌కు 201.24 (బీబీనగర్ మండలం కొండమడుగులో 49.25 ఎకరాలు, రంగాపూర్‌లో 151.39 ఎకరాలు) ఎకరాల స్థలాన్ని అందజేశారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ఎయిమ్స్ డైరెక్టర్ సంతకం చేశారు.
కిషన్‌రెడ్డి, సంజయ్ జవాబు చెప్పలేదు. విషయం దాటేసి ఏవేవో మాట్లాడారు.
బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో 16 వందలు కేంద్రానివే. వీటికి రాష్ట్రం మరో నాలుగు వందలు కలిపి ఇస్తుంది అంతే: బండి సంజయ్ (28-10-2020, దుబ్బాక)సవాలు: మంత్రి హరీశ్‌రావు (29-10-2020)
బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో 16 వందలు కాదు కదా.. 16 పైసలు కేంద్రానివి ఉన్నట్టు నిరూపిస్తే మంత్రి పదవికి, సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే దుబ్బాక పాత బస్టాండ్ చౌరస్తాలో బండి సంజయ్ ముక్కు నేలకు రాస్తారా? దీనిపై బహిరంగ చర్చకు నన్నే కరీంనగర్‌కు రమ్మంటరా? లేక మీరే దుబ్బాక వస్తారా?
సంజయ్ జవాబు చెప్పకుండా పారిపోయారు.
ప్రొఫెసర్ జయశంకర్ స్మారక చిహ్నం కోసం కేటాయించిన భూమి కబ్జా చేసిండ్రు: బండి సంజయ్(06-01-2021, వరంగల్)
సవాలు: దాస్యం వినయ్‌భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్ (07-01-2021)
నేను భద్రకాళి అమ్మవారిని నమ్ముతా.. కబ్జా కాలేదని నిరూపిస్తా. అయిందని భద్రకాళి అమ్మవారి ఎదుట ప్రమాణం చేసేందుకు బండి సంజయ్ సిద్ధమేనా?
సంజయ్ జవాబివ్వకుండా పారిపోయారు.
వరంగల్ నగర అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చింది: బండి సంజయ్(06-01-2021, వరంగల్)
సవాలు: ఎర్రబెల్లి దయాకర్‌రావు,
పంచాయతీరాజ్ శాఖ మంత్రి
(07-01-2021)
వరంగల్‌కు కేంద్రం నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?
సంజయ్ జవాబు చెప్పకుండా పారిపోయారు.