Nishikant Dubey | న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ‘సుప్రీం కోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంట్ భవనాన్ని మూసేయాలి?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి నోరుపారేసుకున్నారు. కేంద్ర ఎన్నికల మాజీ ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నికల కమిషనర్ కాదు.. ముస్లిం కమిషనర్ అంటూ ఆరోపించారు.
‘వక్ఫ్ చట్టం దుర్మార్గమైనదనడంలో ఎలాంటి సందేహం లేదు. ముస్లింల భూములను లాక్కోవడానికే మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చిందంటూ’ ఇటీవల ఖురేషి చేసిన ఆరోపణలపై ఆదివారం ఆయన స్పందిస్తూ ‘మీరు ఎన్నికల కమిషనర్ కాదు.. ముస్లిం కమిషనర్. మీ హయాంలోనే గరిష్ఠ సంఖ్యలో బంగ్లాదేశ్ చొరబాటుదారులను జార్ఖండ్‌లోని శాంతల్ పరగణలో ఓటర్లుగా మార్చారు’ అంటూ విమర్శించారు.
దూబేపై కోర్టు ధిక్కార చర్యలు కోరుతూ ఫిర్యాదు
వక్ఫ్ చట్టం కేసులో సుప్రీం కోర్టుపై, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని ఆ కేసులో ఒకరి తరపున వాదిస్తున్న సుప్రీం కోర్టు న్యాయవాది అనస్ తన్వీర్ కోరారు. ఈ మేరకు ఆయన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి లేఖ రాశారు.