వెల్దుర్తి/సిరిసిల్ల టౌన్, నవంబర్ 30: బీజేపీ నాయకుల నిరసనలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. బెదిరిన ఎడ్లు బండ్లతో సహా రంకెసి ఉరుకడంతో రెండు కార్లు, బైకు ధ్వంసమయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను ఎత్తివేయాలని బీజేపీ నేతలు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఎండ్లబండ్లతో ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో వెల్దుర్తిలోని హనుమాన్ చౌరస్తా నుంచి బస్టాండ్ చౌరస్తా వైపు వెళ్తున్న క్రమంలో ఎడ్లు బెదరడంతో వేగంగా పరిగెత్తి తూప్రాన్ వైపు వెళ్తున్న రెండు కార్లను బలంగా ఢీకొట్టాయి. మొదటగా ఇన్నోవా వాహనాన్ని ఎడమ వైపు ఢీకొన్న ఎడ్లబండి.. వెనుక ఉన్న టాటా వాహనంపై ఏకంగా బండి చక్రం ఎక్కి పక్కకు పడిపోయింది. రెండు కార్లు పాక్షికంగా ధ్వం సమయ్యాయి. కాగా మరో ఘటనలో సిరిసిల్ల్ల తాసిల్దార్ కార్యాలయం వరకు ఎడ్లబండిపై ర్యాలీగా చేరుకుంటున్న క్రమంలో నేతలు చేసిన నినాదాలతో ఎడ్లు బెదిరాయి. బండితో సహాతో పరుగులు పెట్టాయి. ఎడ్ల బండిపై ఉన్న బీజేపీ పట్టణాధ్యక్షుడు అన్నల్దాస్ వేణు తోపాటు పలువురు నాయకులు కింద పడిపోవడంతో వారికి గాయాలయ్యా యి. ఎడ్లు అలాగే పరిగెత్తుకుంటా తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధిలోకి వెళ్లాయి. అక్కడే నిలిపి ఉన్న కుర్మాచలం శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన బైక్‌ను ఎడ్ల బండి తగలడంతో వాహనం పాడైపోయింది. ఈ సమయంలో స్థానికులు ఎవరూ ఆ ప్రాంతాల్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా జరిగి ఉంటే బాధ్యులు ఎవరని మండిపడ్డారు.