
జీడిమెట్ల, అక్టోబర్ 24: టీఆర్ఎస్ నాయకుడి ఇంటిపై దాడిచేసిన బీజేపీ కార్యకర్తలు.. తిరిగి వారే ఠాణాలో ఫిర్యాదుచేసిన ఘటన కుత్బుల్లాపూర్ సర్కిట్లో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్ ఫేజ్-1 సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకుడు బీ కృష్ణ ఇంట్లో మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు బిజ్జిలి సాంబయ్య ఆధ్వర్యంలో ఆయన అనుచరులు ఇంటిపై దాడికి యత్నించగా అక్కడే ఉన్న మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి గొడవ వద్దని వారించారు. సమావేశం అనంతరం బీజేపీ కార్యకర్తలు సంక్షేమ సంఘం అధ్యక్షుడి ఇంటిపై రాళ్లతో దాడి చేయడంతో ఫర్నిచర్ ధ్వంసమైంది. దీనిపై బీజేపీ కార్యకర్తలే జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ విషయ మై జీడిమెట్ల సీఐ కే బాలరాజును సంప్రదించగా.. బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.